Asianet News TeluguAsianet News Telugu

మే 26వ తేదీ చంద్రగ్రహణం: తెలుగు ప్రజలపై ప్రభావం ఇదీ...

ఈ నెల 26వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. తెలుగు ప్రజలపై ఈ చంద్రగ్రహణం ప్రభావం ఏమిటనేది చూడండి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏం చేయాలో చూడండి.

The Lunar eclipse will not effect in Telangana and Andhra Pradesh
Author
Hyderabad, First Published May 23, 2021, 6:48 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

శ్రీ ప్లవనామ సంవత్సర వైశాఖ పూర్ణిమ 26 మే 2021 బుధవారం వృశ్చికరాశి అనూరాధ నక్షత్రంలో కేతుగ్రస్త చంద్ర గ్రహణం సంభవించనున్నది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని గమనించిన గర్భిణిస్త్రీలు  గ్రహణ నియమాలు పాటించాలా..? గ్రహణం ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఏర్పడుతున్నది..? గర్భిణి స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అని మాకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, వారు పడుతున్న భయందోళనలు చూసి ఈ వ్యాసం వ్రాయడం జరిగినది.

ఈ చంద్ర గ్రహణం మన తెలుగు రాష్ట్రాల వారికి అస్సలు వర్తించదు. గ్రహణ నియమాలు ఏమి పాటించనవసరం లేదు. అన్ని పంచాంగాలు కూడా ముక్త కంఠoతో ఈ సంవత్సరం మనకు అసలు గ్రహణాలే లేవని తెలియజేస్తున్నాయి, ఇతర ప్రాంతాలలో ఎక్కడైన గ్రహణాలు ఏర్పడినా అవి మనకు వర్తించవనే తెలియజేసారు. అందుకు గల కారణాలను నేను మీకు వివరంగా ఈ క్రింది లైన్ లో వివరిస్తున్నాను.

గ్రహాణాలు ఎలా ఏర్పడతాయి:- సూర్యునికి, భూమికి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. రవి, భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ  చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు పరిధిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. రవి, చంద్రులకు మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే రవి, భూమి , చంద్రులు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్ద గానీ కేతువు వద్దగానీ ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. 

పూర్తి చంద్రబింబం కనబడకపోతే దాన్ని సంపూర్ణ చంద్ర గ్రహణం అని అంటారు. కొంత భాగం కనిపించక పొతే దానిని పాక్షిక చంద్రగ్రహణం అంటాం. సూర్యుని కాంతి చంద్రుని పైన పడుతుంది. భూమి నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంత వరకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. ఈ స్థితినే గ్రహణం అని అంటాం. రాహువు వద్దకు గానీ కేతువు వద్దకు గానీ ఈ గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది.     

చంద్ర గ్రహణం:- చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీనినే చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు కనిపిస్తుంది. 

చంద్ర గ్రహణానికి కావలసిన పరిస్థితులు :- చంద్ర గ్రహణానికి క్రింది పరిస్థితులు కావలెను.

1. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
2. చంద్రుడికీ సూర్యుడికీ మధ్య భూమి వుండాలి.
3. నిండు పౌర్ణమి రాత్రి అయి వుండాలి.
4. చంద్ర గ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యా బిందువులపై ఆధారపడి వుంటుంది.

"ప్రతి ఛాయా గ్రహణం" అంటే భూమి ఛాయా పరిధిలో కాకుండా ప్రతి ఛాయాలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఏర్పడే చంద్ర గ్రహణం. మన కాలమాన ప్రకారం ప్రతి ఛాయా పాక్షిక చంద్ర గ్రహణమునకు భారతీయ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం మనం ఈ ఏర్పడే గ్రహణానికి మనకు ఏలాంటి సంబంధం ఉండదు కాబట్టి ఎవరూ ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు, ఎలాంటి గ్రహణ నియమాలు వర్తించవు, పాటించనవసరం లేదు. ఈ విషయాన్ని తప:శక్తి సంపన్నులైన ఋషుల పరిశోధనలో నిర్ధారించిన నియమం. 

గమనిక :- ప్రముఖ పంచాంగ కర్తలు వారి పంచాంగంలో 26 మే 2021 బుధవారం రోజు పలు శుభ ముహూర్తాలను వారి వారి పంచాంగాలలో నిర్ణయించారు, ఆ రోజు గ్రహణం ఉంటే ముహూర్తాలు ఉండవు. ఆ రోజు ముహూర్తాలను గమనించండి.

* తిరుమల తితుపతి దేవస్థాన ఆస్థాన సిద్దాంతి గారు తంగిరాల వారి పంచాంగంలో ఆ రోజు వివాహం, నూతన వ్యాపార క్రయవిక్రయాలకు, అన్నప్రాసన, దస్తావేజులకు ముహూర్తాలను ఇచ్చారు.

* శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారు , వరల్డ్ టాప్ అస్ట్రోలజర్..  ములుగు వారి పంచాంగంలో ఆ రోజు గర్భాధానం ముహూర్తం ఇచ్చారు.

* శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనములతో 'భక్తినివేదన' ఆధ్యాత్మిక మాస పత్రిక సమర్పించే సూర్య సిద్ధాంతానుసారి సాయన పంచాంగం శ్రీమాన్ శ్రీ సంపత్కుమారాచార్య కృష్ణమాచార్య సిద్ధాంతి గారు ఆ రోజు ఇచ్చిన ముహూర్తాలు వివాహం, వ్యాపార ప్రారంభం, ప్రతిష్టలు.

* భారత ప్రభుత్వ ఆమోద సూర్య సిద్ధాంత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్జ గారి పంచాంగంలో ఆరోజు ముహూర్తాలు వివాహం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, దేవతా ప్రతిష్టలు, పెండ్లి చూపులు, శుభాతాంబూల, సీమంతాదులు, వాణిజ్యం, అగ్రిమెంట్లు, ఉయాల, పెండ్లి చూపులు, వాహన ప్రారంభం, గృహప్రవేశ ముహూర్తాలు ఇచ్చారు.

* సూర్య సిద్ధాంత గణిత రాళ్ళబండి వారి పంచాంగ కర్త బ్రహ్మశ్రీ డా. రాళ్ళబండి లంకేశ్వారాచార్యులు దైవజ్జ గారు ఆ రోజు గృహప్రవేశ ముహూర్తం ఇచ్చారు.

* భారత ప్రభుత్వ ఆమోదిత దృక్సిద్దాంత గణిత పంచాంగ కర్త శ్రీ చింతా గోపి శర్మ సిద్దాంతి గారి పంచాంగంలో ఆ రోజు క్రయ విక్రయాలకు, సీమంతాలకు, వివాహాలకు ముహూర్తాలు ఇచ్చారు.

* శ్రీ శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్జ గారు బుట్టేవారి పంచాంగంలో ఆ రోజు వివాహం, గృహారంభాలకు, ప్రవేశాలకు, ప్రతిష్టలు, అక్షరాభ్యాసం, నామకరణం, వ్యాపారం, రిజిస్ట్రేషన్లకు ముహూర్తాలు ఇచ్చారు.

* సూర్య సిద్దాంత రాళ్ళవారి గంటల పంచాంగ కర్త బ్రహ్మశ్రీ రాళ్ళ శివరామాచార్యులు దైవజ్జ చౌటుప్పల్ గారు  వివాహం, గృహారంభాలకు, ప్రవేశాలకు ముహూర్తాలు ఆ రోజు ఇచ్చారు. 

* సూర్య సిద్దాంత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ శ్రీ రాంభట్ల చంద్రశేఖర సిద్ధాంతి గారి పంచాంగంలో ఆ రోజు వివాహ ముహూర్తం ఇచ్చారు. 

* సూర్య సిద్దాంత పుష్పగిరి మహా సంస్థాన పంచాంగ కర్త సిద్ధిపేట వాస్తవ్యులు బ్రహ్మాభట్ల శ్రీనాధశర్మ గారి పంచాంగంలో ఆ రోజు వివాహ ముహూర్తం నిర్ణయించారు.

* వాణిజ్య దర్శిని సూక్ష్మగణిత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ డా. ప్రదీప్ జోషి గారి పంచాంగంలో ఆ రోజు వ్యాపారాప్రారంభాలకు, ముఖ్యకార్యక్రమాలు, వివాహం, శంకుస్థాపన, గృహరంభం ముహూర్తాలను ఇచ్చారు.

* భారత ప్రభుత్వ ఆమోదిత రాజమండ్రి కాలబైరవ గురు సంస్థాన్ మఠం పంచాంగ కర్త శ్రీ శ్రీ శ్రీ కాల భైరవిస్వామి వారు ఆ రోజు వివాహం, గృహప్రవేశాలకు, శంకుస్థాపన, గృహారంభాలకు ముహూర్తాలు ఇచ్చారు.

ముఖ్య వివరణ :- ఇలా అన్ని పంచాంగాలలో దైవజ్ఞులైన పంచాంగ కర్తలు ఆ రోజు అనేకానేక ముహూర్తాలను ఇవ్వడం జరిగినది కావున ఎవరూ ఎలాంటి గ్రహణం ఉందనే సందేహాలు పెట్టుకోవద్దు. 

26 బుధవారం రోజు ఛాయలో చంద్ర స్పర్శ మధ్యహ్నం 3:15 మొదలగును, మోక్ష సమయం సాయంత్రం 6:22 నిమిషాలు. కానీ దానికి ముందే మధ్యహ్నం 2:18 నిమిషాలకు ప్రచ్చాయలో గ్రహణం మొదలవుతుంది. తిరిగి గ్రహణ ముగింపు సాయంత్రం 6:22 నుంచి 7:20 వరకు చంద్రుడు ప్రచ్చాయలోనే ఉంటాడు. ప్రచ్చాయలో చంద్రుడు కాంతివిహీనమై మసకబారి ఉండునే తప్ప గ్రహణంతో ఉండడు కాబట్టి మనకు గ్రహణం వర్తించదు, ఎలాంటి గ్రహణ దోష నివారణలు పాటించనవసరం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios