భారతదేశ చరిత్రలో 1942 ఆగస్టు నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ రోజు మొదలైన ఒక విప్లవాత్మక ఉద్యమమే భారతీయులకు స్వాతంత్య్రాన్ని వచ్చేలా చేసింది. అదే క్విట్ ఇండియా ఉద్యమం. సరిగ్గా ఈ ఉద్యమం ప్రారంభమైన 5 ఏళ్ల తర్వాత బ్రిటీష్ వారు భారతదేశం నుండి పారిపోయారు. 

మన దేశానికి స్వాతంత్రం రావడానికి వందేళ్ల క్రితం నుంచి స్వతంత్య్రోద్యమ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. వందల కొద్దీ స్వాతంత్య్రోద్యమకారులు తమ ప్రాణాలను, మానాలను, ఆస్తులను త్యాగం చేస్తూనే వచ్చారు. 1942 ఆగస్టు 8న మొదలైన క్విట్ ఇండియా విప్లవం భారతీయ స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. సరిగ్గా ఈ ఉద్యమం ప్రారంభమైన ఐదేళ్ల తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వారి దేశానికి పారిపోయారు.

83 ఏళ్ల క్రితం క్విట్ ఇండియా

మన స్వాతంత్య్రోద్యమకారులు ఇదే రోజున ‘డు ఆర్ డై’ నినాదంతో స్వతంత్ర పోరాటంలోకి దూకారు. ఇక స్వాతంత్రోద్యమంలో ఇదే చివరి అంకమని, భారతదేశానికి స్వాతంత్ర్యం ఇప్పించాలని లేకుంటే ఆ పోరాటంలో మరణించాలని స్వాతంత్రోద్యమకారులు నిర్ణయించుకున్నారు. అలా క్విట్ ఇండియా ఉద్యమం మొదలై బ్రిటిష్ వారి పునాదులని కదిలించింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం మొదలై నేటికీ 83 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జనరేషన్ జెడ్ వారికి ఈ ఉద్యమ చరిత్ర గురించి తెలిసింది చాలా తక్కువ. అందుకే వారికి క్విట్ ఇండియా ఉద్యమం ఎందుకు జరిగిందో.. వాటి ఫలితం ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉంది.

1942వ సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం దేశం ప్రపంచం నలుమూలల రాజుకుంటున్న రోజులు అవి. దేశంలో శతాబ్దాల నుండి బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందాలని భారతదేశం కూడా అశాంతితో నిండిపోయింది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చివరి దశకు చేరుకున్న పరిస్థితిలో ఏర్పడ్డాయి. వందేళ్ళ పోరాటం చివరి దశకు వచ్చింది. స్వాతంత్రోద్యమకారులంతా ఐకమత్యంగా నిలిచారు.

1942 ఆగస్టు 8 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని ఇండియాను వదిలి వెళ్ళమని చెప్పడమే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న కాలంలోనే ఈ ఉద్యమం కూడా ప్రారంభమైంది. అప్పుడు పశ్చిమ దేశాల్లో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో చెప్పిన ప్రకారం క్విట్ ఇండియా ఉద్యమం వెనుక ప్రధాన కారణాలు మూడు ఉన్నాయి.

క్విట్ ఇండియా వెనుక కారణాలు

అందులో మొదటిది 1942 మధ్యలోనే జపాన్ సైన్యం భారత సరిహద్దుల వైపు రావడం ప్రారంభించింది. ఇక రెండవది.. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే లోపు భారతదేశ భవిష్యత్తు ఏంటో తేల్చాలని చెబుతూ చైనా, అమెరికా.. బ్రిటన్ పై ఒత్తిడి తేవడం మొదలుపెట్టాయి. ఇక మూడో కారణం 1942 మార్చిలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటన ముసాయిదాను చర్చించడానికి బ్రిటిష్ ప్రధానమంత్రి సన్ స్టాఫ్ఫోర్డ్ ట్రిప్స్ ను భారతదేశానికి పంపారు. ఇదే సమయంలో బ్రిటిష్ పాలనపై భారతీయ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేగింది. మహారాష్ట్రలోని ముంబైలో జాతీయ కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటిష్ వారు తమ పాలన ముగించి వెంటనే దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలన్నదే ఈ తీర్మానం వివరణ.

డూ ఆర్ డై నినాదం

ఆగస్టు 8న గాంధీజీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మనం భారతదేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేద్దాం. లేదంటే ఆ ప్రయత్నంలోనే మరణిద్దాం. మన బానిసత్వం కొనసాగడాన్ని చూస్తూ ఇక మనం బతకలేము’ అంటూ ఆయన ముగించారు. ఆ తర్వాత అరుణ అసఫ్ అలీ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. అలా క్విట్ ఇండియా ఉద్యమం అధికారికంగా ప్రకటించారు.

ఉద్యమం వల్ల ఎంతోమంది స్వాతంత్రోద్యమకారులు స్థానికంగా నాయకులుగా ఎదిగారు. వారే ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. భారతదేశంలోని ప్రతి చోటా ఈ ఉద్యమం తాలూకు సెగ బ్రిటిష్ వారికి తగులుతూనే ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ చిహ్నాలకు, ప్రభుత్వ భవనాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శన చేశారు. ప్రభుత్వ భవనాలపై కూడా జాతీయ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు ఏర్పరచుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో మహిళలు అధికంగా పాల్గొనడం చెప్పుకోదగ్గ విషయం. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు బ్రిటీష్ ప్రభుత్వం ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎక్కడకక్కడ అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ఆ తర్వాత బ్రిటన్ అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే భారత దేశంలో కూడా వారికి విపరీతమైన వ్యతిరేకత రావడంతో ఇక దేశాన్ని విడిచి వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించి బ్రిటిష్ వారంతా తమ దేశానికి వెళ్లిపోయారు.