యాకుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా

                                యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా

                                యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్‌ దేవై సదా వందితా

                                సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహః

ఏడవరోజు సప్తమి మూల నక్షత్రంరోజు నవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారంలో ఒకచేతిలో వీణ మరొ చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా మన పూజలు అందుకుంటుంది. ఈ రోజు అమ్మవారికి అభిషేకం చేసి, పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. పిల్లలు విద్యా విషయంగా ఎంతో వృద్ధి చెందుతారు.

వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని. దుర్గాదేవి నక్షత్రమైన మూలానక్షత్రం రోజున సరస్వతిగా అలంకరించటం విశేషం.

వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానం - వీికి అధిష్ఠాత్రి మహా సరస్వతీ దేవి. ''సర్వ విద్యా స్వరూపా యా సా చ దేవీ సరస్వతీ''. సంగీతం, సాహిత్యం, మేధస్సు, ప్రతిభ, స్మృతి, వ్యాఖ్యానం, బోధనాశక్తి, సందేహ నివారణ శక్తి - సరస్వతీ రూపాలే. పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రాదులను సమన్వయం చేయించే 'సమన్వయ శక్తి' ఈ భారతీ దేవి. వీణాపుస్తక ధారిణి. మల్లెలా, మంచులా, వెన్నెలలా, శుద్ధత్వానికి ప్రతీకగా ధవళ కాంతులతో ప్రకాశించే తల్లి మహా సరస్వతి. తపస్వుల తపశ్శక్తి. సిద్ధి స్వరూపిణి. వాగ్దేవి, వాణీదేవి, శారదాదేవి, బ్రాహ్మీ. ఈ తల్లి దయవల్లే మాటలు, మేధస్సు సమకూరుతాయి. కనుక 'సరస్వతీ కాక్షం' మనం యాచించాలి.

సరసతి అనగా కదులుట అని అర్థం. అన్ని రకాల కదలికలకు మూల స్వరూపం జ్ఞానమే. అందుకే సరస్వతి జ్ఞాన స్వరూపిణి. సూర్యునిలోని వెలుగునంతా ఒక్కచోట ముద్దచేస్తే ఆ కనిపించే రూపం సరస్వతిగా మన ఉపాసకుల భావన. అందుకే ఈమెను సర్వశుక్లగా, శ్వేతాంభరదారిణిగా ఈమెను కొలుస్తాం. శరీరానికి ధరించిన వస్త్రాభరణాదులన్నీ తెలుపు రంగులో ఉండడం మనకు జ్ఞానానికి సంకేతంగా చూపించేవే. ఏ వస్తువుపైనైనా వెలుగు పడితే అది మనకు కనిపిస్తుంది. అంటే ఆ వస్తు పరిజ్ఞానం మనకు తెలుస్తుంది. 'తెలుపు' తెలుపుతుంది. అందువల్ల కనిపించే వస్తువులే కాకుండా కనిపించని ఎన్నో అంశాలమీద కూడా ఈ అమ్మ దృష్టి కేంద్రీకరిస్తే ఈ అమ్మ అనుగ్రహం వల్ల ఎన్నో రహస్యాలు ద్యోతకమౌతాయి. ఈ సృష్టి రహస్యాలన్నీ ఈ అమ్మ అనుగ్రహం వల్ల తెలుసుకున్నవే.

చేతిలోని వీణ సంగీత విద్యలకు, పుస్తకం లౌకిక విద్యలు, అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆకాశంలో అభిజిత్‌ నక్షత్రం పక్కన వీణామండలం అని ఒకటుంది. వీణామండలాన్ని లైరా అనే పేరుతో పిలుస్తారు. శబ్దతరంగాల మూల స్వరూపమంతా ఆ మండలముగా ఖగోళ శాస్త్రవేత్తల భావన. వీణామండలం దగ్గరే హంసమండలం కూడా ఉంటుంది. హంసవాహినియైన సరస్వతిని ఖగోళ శాస్త్రవేత్తలు ఆ విధంగానే దర్శించారు. అటు ఖగోళపరంగా ఇటు వైజ్ఞానికంగా అమ్మవారు జ్ఞానశక్తి స్వరూపిణి. అజ్ఞానం మనిషికి జాడ్యాన్నిస్తే జ్ఞానము ఆత్మోద్ధరణకు సంకేతంగా మారుతుంది. మీదపడిన వస్తు పరిజ్ఞానం నుండి తనేమిో తనకు తెలిసే ఆత్మ పరిజ్ఞానం వరకు ఈ అమ్మ కృపతోనే సాధ్యమౌతుంది. అందుకే ఆ అమ్మను నిరంతరం ఉపాసించాల్సిందే. ఈ నవరాత్రుల్లో నమస్కరించాల్సిందే..

తెల్లని  వస్త్రాలు ధరించి అమ్మ  దేదీప్యమానంగా  వెలుగుతూ మనకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మకు శాకాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.

డా.ఎస్.ప్రతిభ