Asianet News TeluguAsianet News Telugu

'జైరా వసీం'కు భద్రత పెంపు.. ఇది 'అల్లా' నిర్ణయం అంటున్న ముస్లిం పెద్దలు!

దంగల్ చిత్రంతో జైరా వసీం నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దంగల్ చిత్రం తర్వాత జైరా వసీం గురించి సోషల్ మీడియాలో సైతం జోరుగా చర్చ జరిగింది. 

Zaira Wasim gives full clarity on quitting movies
Author
Hyderabad, First Published Jul 1, 2019, 5:55 PM IST

దంగల్ చిత్రంతో జైరా వసీం నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దంగల్ చిత్రం తర్వాత జైరా వసీం గురించి సోషల్ మీడియాలో సైతం జోరుగా చర్చ జరిగింది. టీనేజ్ లోనే నటనతో అదరగొట్టిన జైరా భవిష్యత్తులో అద్భుతమైన నటిగా ఎదుగుతుందని ప్రముఖులు సైతం ప్రశంసించారు. కానీ అనూహ్యంగా తాను ఇకపై సినిమాలలో నటించడం లేదని జైరా ట్వీట్ చేయడం అటు బాలీవుడ్ తో పాటు రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. 

తాను బాలీవుడ్ కు సరిపడనంటూ, ఇకపై సినిమాల్లో నటించేది లేదు అంటూ జైరా వసీం నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా జైరా వసీంకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. దీనితో ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరికొంత మంది ఆమె సోషల్ మీడియా హ్యకై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా హ్యాకింగ్ కి గురికాలేదని.. సినిమాల నుంచి తప్పుకోవడం అనేది పూర్తిగా తన నిర్ణయమేనని.. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని జైరా మరో ట్వీట్ చేసింది. 

ప్రస్తుతం జైరా వసీం నిర్ణయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జైరా వసీం సినిమాల నుంచి తప్పుకోవడం అల్లా నిర్ణయం అంటూ సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ఆజామ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలు విధిగా బుర్ఖా ధరించాలని, సినిమాల్లో నటించడం తమ ఆచారాలకు విరుద్ధం అని అన్నారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జైరా వసీంకు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక అలనాటి నటి నగ్మ జైరా వసీం కు మద్దత్తు తెలిపారు. జైరా వసీం ఎంతో ధైర్యం ఉన్న యువతి. ఇలాంటి సమయంలో ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను అని నగ్మా ట్వీట్ చేశారు. మరో బాలీవుడ్ నటి రవీనా టాండన్ మాత్రం ఆదరించిన బాలీవుడ్ పై నిందలు వేసి వెళ్లిపోవడం తగదని అన్నారు. జైరా వసీం తీసుకున్న నిర్ణయంపై రాద్దాంతం వద్దు. ఆమెకు ఏది సంతోషమో అది చేయనివ్వండి. ఆమె జీవితం మొత్తం మంచి జరగాలని కోరుకుంటున్నట్లు జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios