మన్మథుడు నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య హీరోగా మారి 11 ఏళ్ళు అవుతుంది. ఆయన 2009లో `జోష్‌` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది 2009 సెప్టెంబర్‌ 5న టీచర్స్ డేని పురస్కరించుకుని విడుదలైంది. ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేదు. కానీ చైకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2010లో వచ్చిన `ఏం మాయ చేసావె` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.

`100% లవ్‌`, `మనం`, `ప్రేమమ్‌`, `మజిలి`, `వెంకీమామ` చిత్రాలతో విజయాలు అందుకున్న చై పదకొండేళ్ళ కెరీర్‌లో 19 సినిమాలు చేయగా, ఆరు మాత్రమే విజయాలు సాధించాయి. `మజిలీ` ముందు వరకు హీరోగా మనగడ కోసం పోరాడుతున్న హీరోగా చైతూపై అనేక కామెంట్స్ వినిపించాయి. వాటన్నింటికి `మజిలీ`తో ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. 

ప్రస్తుతం `లవ్‌ స్టోరి` లో నటించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించగా, ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటించబోతున్నారు.

ఇక చైతూ పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు స్పెషల్‌ కామన్‌ డీపీని విడుదల చేశారు. ఇందులో `జోష్‌`, `ఏం మాయ చేసావె`, `మనం`, `100% లవ్‌`, `మజిలీ`, `వెంకీమామ`, `సాహసం శ్వాసగా సాగిపో` వంటి చిత్రాల్లోని చైతూ గెటప్స్ ని పొందుపరిచారు. తాజాగా ఈ కామన్‌ డీపీ ఆకట్టుకుంటుంది. మరోవైపు నెగిటివ్‌ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ పదకొండేళ్ళలో ఏం సాధించావ్‌? అని ప్రశ్నిస్తున్నారు.