తారకరత్న గుండె పనితీరు మెరుగైంది మెదడు మాత్రం... షాకింగ్ విషయాలు వెల్లడించిన వైసీపీ ఎంపీ!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరో తారకరత్న హెల్త్ పై అప్డేట్ ఇచ్చారు. నేడు తారకరత్నను సందర్శించిన విజయసాయిరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.

బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ కి గురైన తారకరత్నను కుప్పం నుండి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలించారు అన్ని విభాగాలకు చెందిన నిపుణుల వైద్య బృందం తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. మొదట్లో తారకరత్న కండీషన్ చాలా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగవుతునట్లు వార్తలు వస్తున్నాయి.
తారకరత్న కుటుంబ సభ్యులు ఇదే విషయం వెల్లడించారు. నేడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తారకరత్నను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తారకరత్న కోలుకుంటున్నారు. ఆయన హార్ట్ ఫంక్షనింగ్ బాగుంది. శరీరం చికిత్సకు స్పందిస్తుంది. రక్త ప్రసరణ కూడా మెరుగైంది. అయితే కార్డియాక్ అరెస్ట్ కి గురైన రోజు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ జరగలేదు. దీనివల్ల మెదడు పై భాగం కొంత దెబ్బతింది. అయినప్పటికీ తారకరత్న కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయన్నారు.
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తారకరత్నను సందర్శించడం ఆసక్తికరంగా మారింది. బంధువుగా తారకరత్నకు చికిత్స జరుగుతున్న ఆసుపత్రికి విజయసాయిరెడ్డి వెళ్లారు. వైద్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. తారకరత్నకు విజయసాయిరెడ్డి మామ వరస అవుతారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సునంద, అలేఖ్య రెడ్డి తల్లి సొంత అక్కచెల్లెళ్ళు.
కాస్ట్యూమ్ డిజైనర్ అయిన అలేఖ్యా రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. తారకరత్న నటించిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య పనిచేశారు. ఆ టైంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆల్రెడీ అలేఖ్య పెళ్ళై విడాకులు తీసుకున్నారు. దీంతో అలేఖ్యను పెళ్లి చేసుకునేందుకు తారకరత్న పేరెంట్స్ ఒప్పుకోలేదు. పెద్దలను ఎదిరించి 2012లో సంఘీ టెంపుల్ లో అలేఖ్యను తారకరత్న పెళ్లి చేసుకున్నారు.