దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం 2019లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి ఎన్నికల ముందు సందడి చేసేందుకు యాత్ర 2 చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం 2019లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రిలీజ్ కావడంతో ఆ చిత్రం వైఎస్ జగన్ కి, వైసీపీకి బాగా ఉపయోగపడిందనే భావన చాలా మందిలో ఉంది. 

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి ఎన్నికల ముందు సందడి చేసేందుకు యాత్ర 2 చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. యాత్ర 2లో వైఎస్ఆర్ మరణం.. వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో ఎదిగిన విధానం హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జగన్ చేసిన పాద యాత్రని ఎమోషనల్ గా మహి వి రాఘవ్ చూపించబోతున్నారు. 

తాజాగా యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాయిస్ తో మోషన్ పోస్టర్ మొదలవుతుంది. నమస్తే బాబు, నమస్తే చెల్లమ్మా, నమస్తే అంటూ వైఎస్ఆర్ వాయిస్ తో భారీ చేతి స్టాట్యూని చూపిస్తుంటారు.

ఆ స్టాట్యూపైకి జగన్ వెళతారు. నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. నేను విన్నాను నేనున్నాను అంటూ జగన్ పాత్రధారి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ తాను విమర్శలని పట్టించుకోను అని అన్నారు. 

YouTube video player

రాజకీయం కోసం ఈ చిత్రం చేస్తున్నారా, ఎన్నికల ముందే ఎందుకు వస్తోంది.. ఇలాంటి విమర్శలకు తాను సమాధానం చెప్పను అని మహి వి రాఘవ్ అన్నారు. 2009 నుంచి 2019 వరకు జగన్ రాజకీయ ప్రయాణంపై యాత్ర 2 ఉంటుందని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. జగన్ పాత్రలో నటించే నటుడిని ఇంకా ఫైనల్ చేయలేదు అని అన్నారు. త్వరలో అతడు ఎవరో ప్రకటిస్తాం అని తెలిపారు. శివ మేక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.