ప్రముఖ  యువ నటుడు నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో నాగ శౌర్యకు చికిత్స కొనసాగుతున్నట్టుగా సమాచారం.

ప్రముఖ యువ నటుడు నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. ఓ షూటింగ్ జరుతున్న సమయంలో నాగ శౌర్య సొమ్మసిల్లి పడిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే అక్కడివారు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో నాగ శౌర్యకు చికిత్స కొనసాగుతున్నట్టుగా సమాచారం. అయితే నాగ శౌర్యకు ఎలాంటి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. 

హైదరాబాద్ శివార్లలో ఓ మూవీ యాక్షన్ స్వీకెన్స్ షూట్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. నాలుగు రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవడంతో డీహైడ్రేట్ కావడంతోనే ఇలా జరిగినట్టుగా సమాచారం. ఆయన జ్వరంతో కూడా బాధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఫిట్‌నెట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకునే నాగా శౌర్యకు ఇలా జరగడం అభిమానులు, సన్నిహితులను ఆందోళనకు గురిచేస్తుంది. మరో ఐదు రోజుల్లో నాగ శౌర్య పెళ్లి ఉండగా.. ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక, నాగ శౌర్య వివాహం బెంగుళూరులోని జేడబ్ల్యూ మార్రియట్ వేదికగా జరనుంది. రెండు రోజులు వివాహ వేడుక ఘనంగా జరిపేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 19న మెహందీ వేడుక నిర్వహించనున్నారు. మరసటి రోజు నవంబర్ 20న ఉదయం 11:25 నిమిషాలకు పెళ్లి ముహూర్తంగా నిర్ణయించారు. ఇక, నాగ శౌర్య వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా? లేక ప్రేమ వివాహమా? అనేది తెలియాల్సి ఉంది.ఇక నాగ శౌర్య ఇంటిలో పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయాయి. బట్టలు నగలు షాపింగ్, బంధువులకు ఆహ్వానం వంటి పనుల్లో అందరూ నిమగ్నమయ్యారు. 

అనూష విషయానికి వస్తే.. ఆమె బెంగళూరుకు చెందినవారని.. ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అని తెలుస్తోంది. ఆమె ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. 2011 లో విడుదలైన క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ మూవీతో నాగ శౌర్య సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. దర్శకుడు కమ్ యాక్టర్ శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన ఊహలు గుసగుసలాడే మూవీతో నాగ శౌర్య ఫేమ్ తెచ్చుకున్నాడు. ఛలో నాగ శౌర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. సమంత బ్లాక్ బస్టర్ ఓహ్ బేబీ మూవీలో నాగ శౌర్య ఓ రోల్ చేశారు. విజయాలపరంగా వెనుకబడ్డ నాగ శౌర్య హీరోగా పలానా అబ్బాయి పలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక అనే చిత్రాలు తెరకెక్కుతున్నాయి.