సినిమా రంగంలో రాణించాలని ఎందరో యువకులు కలలు కంటూ ఫిలిం నగర్ లో ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళ శ్రమ ఫలించి కొందరు యువకులు దర్శకులుగా, నటులుగా సినిమాలోని ఇతర విభాగాల్లో అవకాశాలు అందుకుంటుంటారు. తాజాగా ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం వద్ద వర్ధమాన యువ దర్శకుడు, ఓ కెమెరా మెన్ మరణించారు. 

ప్రమాదవశాత్తూ వీరిద్దరూ గోదావరిలో పడడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. సుధీర్(33) అనే యువకుడు దర్శకుడిగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. అతడికి కార్తీక్(35) అనే వ్యక్తి కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు. సుధీర్ సొంతూరు రాజమండ్రి. వీరిద్దరో ఓ షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం లొకేషన్స్ చూడడానికి ఆత్రేయ పురం వెళ్లారు. అక్కడ గోదావరిలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు. దీనితో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 

గజ ఈతగాళ్లు సాయంతో ఇద్దరి మృతదేహాలని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. సినిమా రంగంలో రాణించాలని సుధీర్, కార్తీక్ ఆశలు అంతటితో ఆవిరయ్యాయి. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.