దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రం 'యాత్ర'. ఈరోజు వైఎస్ తనయుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమా టీజర్ ని విడుదల చేసింది.

ఏపీ రాజకీయాలపై ఎంతో ప్రభావం చూపిన రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి.. వైఎస్ పాత్ర పోషించబోతున్నారు. 

''నీళ్లు ఉంటే కరెంట్‌ ఉండదు. కరెంట్‌ ఉంటే నీళ్లు ఉండవు. రెండు ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా. మమ్మల్ని రాజులుగా కాదు..కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు'' అంటూ ఓ రైతు తమ బాధలను చెప్పుకునే సన్నివేశంతో టీజర్ మొదలైంది.

'నేను విన్నాను.. నేనున్నాను' అంటూ వైఎస్ పాత్రలో మమ్ముట్టి చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు  రానుంది.