ఆనందో బ్రహ్మ చిత్రంతో దర్శకుడిగా మారారు మహి వి రాఘవ్. ఆ తర్వాత మహి తెరకెక్కించిన యాత్ర చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి యాత్ర చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. వైఎస్ఆర్ కథని చక్కగా చూపించాడనే ప్రశంసలు దక్కాయి. 

యాత్ర తర్వాత మహి వి రాఘవ్ తెరకెక్కించే చిత్రం ఏంటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందరిని ఆశ్చర్యపరుస్తూ మహి వి రాఘవ్ తాజాగా తన కొత్త చిత్రాన్ని, టైటిల్ ని ప్రకటించాడు. మహి వి రాఘవ్ కొత్త సినిమా టైటిల్ 'సిండికేట్'. యాక్షన్ జోనర్ లో ఈ చిత్రం ఉండబోతోంది. 

ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి చిత్రాల తర్వాత యాక్షన్ జోనర్ లో సినిమా చేయాలని నిర్ణయించుకోవడం సాహసోపేతమే. ఒక దర్శకుడు కథ చెప్పడం కంటే ఎలాంటి కథ చెప్పాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. గత చిత్రాల కలెక్షన్స్, నటీనటులు, బడ్జెట్ లాంటి వ్యవహారాలేవి కథ ఎంపికలో ఉపయోగపడవు. నిశ్శబ్దంలో ఉన్నప్పుడు దర్శకుడి మదిలో మెదిలే ఆలోచనే కథ. నా తదుపరి చిత్రం యాక్షన్ డ్రామా. టైటిల్ సిండికేట్ అని మహి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 

పూర్తి స్థాయిలో కథని సిద్ధం చేసి ఈ చిత్రం గురించి వివరాలు తెలియజేస్తానని మహి ప్రకటించాడు.