తాము ఎంతగానో అభిమానించే హీరోల కోసం ఫ్యాన్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే ఆ అభిమానం ముదిరిపోతే మాత్రం అనర్ధాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఓ ఘటన యశవంతపురలో చోటు చేసుకుంది. 

నేడు కన్నడ సూపర్ స్టార్ యష్ పుట్టినరోజు కావడంతో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పాలనుకున్న ఓ అభిమాని అతడిని కలవడానికి అనుమతి ఇవ్వలేదని పెట్రోలు పోసుకొని సజీవ దహనానికి యత్నించాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు రూరల్ నెలమంగళ తాలుకూశాంతినగర్ కి చెందిన రవి అనే వ్యక్తి యష్ కి వీరాభిమాని. నేడు యష్ పుట్టినరోజు కావడంతో ఆయనకి విషెస్ చెప్పడానికి ఇంటి వద్దకు వెళ్లాడు. సెక్యురిటీ సిబ్బంది రవిని లోపలకి అనుమతించకపోవడంతో కాసేపు వేచి చూశాడు రవి. ఎంతసేపటికీ తనను లోపాలకి పంపకపోవడంతో  మధ్యాహ్నం అక్కడే పెట్రోల్ పోసుకొని సజీవ దహనానికి ప్రయత్నించాడు. 

ఇతర అభిమానులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాలిన గాయాలతో ఉన్న రవిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడి శరీర 75 శాతం కాలిపోయింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో రవి ముందుగానే పెట్రోల్ వెంట తెచ్చుకున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.