తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించబడ్డ డా బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయాన్ని ప్రముఖ దిగ్గజ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ సందర్శించారు. ఆయన ప్రశంసలు కురిపించారు.

దిగ్గజ రైటర్‌, ఎంపీ విజయేంద్రప్రసాద్‌ నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని శుక్రవారం సందర్శించారు. కొత్త సచివాలయం మహాద్భుతంలా ఉందని ఆయన కొనియాడారు. సచివాలయం మొత్తం కలియ తిరిగిన విజయేంద్రప్రసాద్‌.. అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం కేసీఆర్‌పై, తెలంగాణపై రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ ప్రశంసలు కురిపించారు. 

తన పట్టుదల, అకుంఠిత దీక్షతో అద్బుతమైన దేవాలయాలను,ప్రజా నిర్మాణాలను చేస్తూ, కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజం చేస్తున్నారని ఆయన అన్నారు. మంచి మనసుతో కొత్తగా కట్టి సచివాలయాన్ని చూసే అవకాశం కల్పించారు. దానికి డా. బీ ఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. వారసత్వ సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం ఉందన్నారు. అతి తక్కువ సమయంలో అతి తక్కువ బడ్జెట్‌లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారని తెలిపారు. 

ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఒక రాష్ట్ర పౌరుడిగా చాలా గర్వంగా ఉంది. కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. ఈ తెలంగాణ కల సాకారం చేసిన కేసీఆర్‌ కి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రానికి తుది శ్వాస వరకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని తెలిపారు. 

విజయేంద్రప్రసాద్‌ ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి కథ అందించిన విషయం తెలిసిందే. అంతేకాదు `బాహుబలి` లాంటి అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు, అలాగే రాజమౌళి చిత్రాలన్నింటికి ఆయన కథలు అందించారు. ఇప్పుడు మరికొన్ని కథలతో ముందుకు రాబోతున్నారు. మహేష్‌బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాకి కూడా ఆయనే కథ అందిస్తున్నారు. ప్రస్తుతం ఇది స్క్రిప్ట్ దశలో ఉంది. పూర్తి కావడానికి ఇంకొన్నాళ్లు పడుతుంది.