ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వైఎస్సార్ సీపీలో చేరే సభ్యుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా 
పాలకొల్లులో ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు.

వీరిలో ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ కూడా ఉన్నారు. 'ఇంద్ర', 'నరసింహనాయుడు' వంటి సినిమాలకు కథలు అందించిన చిన్నికృష్ణ చివరిగా కథ అందించిన సినిమా 'జీనియస్'. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ని, టీడీపీ పార్టీని విమర్శిస్తూ వార్తల్లో నిలిచిన ఈ రచయిత ఇప్పుడు వైఎస్సార్ సీపీలో చేరారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రజలకు ఏం చేస్తారో సూటిగా చెబుతున్నారని.. ఆయన ప్రసంగం విని చాలా మంది ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.