సినిమావాళ్లు అనేముంది...తాగేవాళ్లు అన్ని వృత్తుల్లో ఉంటారు. అయితే సైలెంట్ గా తమ పనేదో తాము కానిచ్చుకుంటారు. కానీ రోడ్డు ఎక్కి తమ ఇజ్జత్ పోగొట్టుకోవాలనుకోరు. కానీ ఫుల్ గా తాగి ఒళ్లు పై తెలియకపోతే పరిస్దితి ఏమిటి...పోలీస్ ఏంటి ప్రధాన మంత్రి అడ్డం వచ్చినా గొడవ పడిపోతారు. తాజాగా  చెన్నైలో ఓ మహిళా అసెస్టెంట్ డైరెక్టర్ తప్పతాగి రోడ్డుపై రచ్చ చేసింది. పోలీసులతో గొడవ పడింది. ఓ పోలీసు అధికారిని బూతులు తిడుతూ, భౌతిక దాడికి దిగింది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంఘటన వివరాల్లోకి వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్ కామిని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తన మిత్రుడు శేషు ప్రసాద్ తో కలిసి కారులో వెళ్తుండగా పోలీసులు ఆపారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా కారు నడుపుతున్న శేషు మోతాదుకు మించి మందు తాగినట్టు తేలింది. దీంతో, పోలీసులు వారి కారును సీజ్ చేశారు.

దీంతో, పోలీసులపై కామిని గొడవకు దిగింది. తాగితే తప్పేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను కొట్టేందుకు కూడా వెళ్లినట్టు వీడియోలో కనపడుతోంది. శేషు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్భాషలాడటం, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది.