ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో వేషం వేయాలని నటులు అవుదామనుకునే చాలా మందికి ఉంటుంది. అయితే ఆ అవకాసం అతి కొద్ది మందికే వస్తుంది. అయితే ఇలాంటి పెద్ద  సినిమాలో వేషం వేయాలనే ఆశ పోని వాళ్లు మోసం చేయటానికి చాలా మంది రెడీ గా ఉంటారు. అయితే లా చదువుకుని నిత్యం కేసులు, పోలీస్ లు , కోర్ట్ లు అంటూ తిరిగే న్యాయవాదిని మోసం చేయటానికి మాత్రం ఎవరూ సాహసించరు. కానీ అనుకోనిది జరిగితేనే కదా వార్త. ఇప్పుడు ఓ మహిళా న్యాయవాది సినిమాలో వేషం నిమిత్తం యాభై లక్షలు పోగొట్టుకోవటమే ఆశ్చర్యంగా మారింది. 

వివరాల్లోకి వెలితే...ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఓ మహిళ  వద్ద నుంచి రూ 50లక్షలు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురిని సెంట్రల్ జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మారుతి కారు, 19.270 గ్రాముల బంగారు ఆభరణాలు, 111.550 గ్రాముల వెండి వస్తువులు, రూ.65,000 నగదు, ఫ్రిజ్, మొబైల్ ఫోన్లు, టివిలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌కు చెందిన వీరబత్తిని నరేష్ కుమార్ అలియాస్ నరేష్ బంజారాహిల్స్‌లోని కోని ల్యాబ్స్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నల్గొండ జిల్లా, చరగొండ గ్రామానికి చెందిన మునుకుంట్ల రామకృష్ణ అలియాస్ రామా పేయింటర్‌గా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌కు చెందిన కొమ్ము సోమన్న పేయింటర్‌గా పనిచేస్తున్నాడు.ముగ్గురిని అరెస్టు చేయగా 13మంది పరారీలో ఉన్నారు. జస్ట్ డయల్ లో  బాధితురాలి నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు.

తాను సినీ నిర్మాత ఆదిత్యను మాట్లాడుతున్నానని, చాలా సిన్మాలు తీశానని, నాకు డైరెక్టర్ రాజమౌళి తెలుసని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి ఉందా అన్ని అడిగాడు. ఆసక్తి ఉంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో తల్లి పాత్రకు అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. వేరు వేరు నంబర్ల నుంచి ఫోన్ చేసి రాజమౌళి వలే మాట్లాడేవాడు. ఆమె పేరుతో ఫిల్మ్ ఛాంబర్ ఐడి కార్డు, మా ఐడి కార్డు, టివి సీరియల్ కార్డు తదితర వాటిని తీసుకోవాలని చెప్పడంతో దశల వారీగా డబ్బులు పంపించింది. 

జనవరి, 2109నుంచి జూన్ వరకు 40 నుంచి 50లక్షల రూపాయలు వివిధ బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ క్రమంలోనే 17,ఏప్రిల్ ,2019వ తేదీన ఆదిత్య బాధితురాలకి ఫోన్ చేసి ఫిల్మ్ సైట్‌కు వెళ్లాలని తన కారు రిపేరుకు వచ్చిందని, బాధితురాలి కారు స్విఫ్ట్ డిజైర్ ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇది నమ్మి కారును ఇచ్చింది అప్పటి నుంచి తిరిగి ఇవ్వలేదు. తర్వాత కూడా పదేపదే డబ్బులు అడుగడం, ఫోన్‌లో భూతులు తిట్టడం చేయడంతో తను మోసపోయానని గ్రహించి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది కేసు దర్యాప్తు చేశారు.