కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో పని చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడమే కాదు.. వ్యక్తిగతంగా అతడి ప్రవర్తనతో మరింత మంది అభిమానులు సంపాదించుకున్నాడు.

ఉడిపిలో పుట్టిన ఆయన 1992లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతడు రూపొందించిన 'తారలే నాన్ మగ' అనే సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఆ తరువాత మరో మూడు సినిమాలను డైరెక్ట్ చేసి ఫైనల్ గా 'A' సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటినుండి వరుస హిట్ చిత్రాల్లో నటిస్తూ తన టాలెంట్ నిరూపించుకున్నాడు. 

'సూపర్', 'రక్త కన్నీరు, 'శ్రీమతి', 'ఉపేంద్ర', 'కల్పనా' ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసేవారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఉపేంద్ర విలన్ కనిపించి మెప్పించాడు.

2003లో నటి ప్రియాంకాని పెళ్లి చేసుకున్న ఉపేంద్రకి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఉపేంద్ర రాజకీయాల పరంగా కూడా బిజీగా గడుపుతున్నారు. సొంతంగా ఓ పొలిటికల్ పార్టీని స్థాపించారు.ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం!