ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలకు సమయం కలిసి రావడం లేదు. ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. వరుస పరాజయాలతో విసిగిపోయి అయోమయంలో పడ్డారు.

పెద్దగా సినిమా నేపథ్యం లేకున్నా శర్వానంద్ (Sharwanand)ఓ స్థాయి హీరోగా ఎదిగారు. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టిన శర్వానంద్ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ... హీరో అయ్యారు. హిట్ సినిమాలు చేసి తనకంటూ ఓ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. శర్వానంద్ తో మూవీ చేయడానికి దర్శక నిర్మాతలు ఎదురుచూసే స్థాయికి చేరారు. అయితే ఈ మధ్య ఆయన టైం ఏం బాగోలేదు. ఆయనకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. 

2017 శర్వానంద్ కెరీర్ లో బెస్ట్ అని చెప్పాలి. ఆ ఏడాది శర్వానంద్ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో శతమానం భవతి, మహానుభావుడు సూపర్ హిట్స్ కొట్టాయి. రాధ మూవీ మాత్రం నిరాశపరిచింది. మహానుభావుడు మూవీ తర్వాత శర్వానంద్ కి మరో హిట్ దక్కలేదు. పడి పడి లేచె మనసు, రణరంగం,జాను, శ్రీకారం, మహాసముద్రం వరుసగా శర్వానంద్ కి షాకిచ్చాయి. 
వీటిలో కొన్ని పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఇక ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి మూవీ మహాసముద్రం అయితే అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరింది. ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఫలితం మాత్రం దారుణంగా వచ్చింది. 

మరో హీరో సుధీర్ బాబు (Sudheer babu)పరిస్థితి మరీ దారుణం. సుధీర్ బాబు హిట్ కొట్టి దశాబ్దం అవుతుంది. ప్రేమ కథా చిత్రం మూవీ తర్వాత.. ఆ స్థాయి హిట్ దక్కలేదు. దండిగా డబ్బులు, బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో కావడంతో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అలా అని ఆయన ప్రయత్న లోపం ఉందనుకుంటే తప్పు. పాత్ర కోసం, పాత్రకు కావలసిన లుక్ కోసం సుధీర్ ఎంతో శ్రమిస్తారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్న సుధీర్ బాబు పాత్ర కోసం ప్రొఫెషనల్ గా సిద్ధమయ్యారు. హిట్ కొట్టాలనే క్రమంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. అయినా ఫలితం దక్కలేదు.

ఈ ఇద్దరు హీరోలు ఎలాగైనా హిట్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో లక్కీ హీరోయిన్ సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. సుధీర్ బాబు, శర్వానంద్ తదుపరి చిత్రాల్లో హీరోయిన్స్ గా కృతి శెట్టి(Krithi Shetty), రష్మిక మందాన (Rashmika Mandanna)నటిస్తున్నారు. సుధీర్ బాబు చేస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రంలో కృతి హీరోయిన్. ఇక శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. 

కృతి శెట్టి హ్యాట్రిక్ కొట్టి లేటెస్ట్ లక్కీ చార్మ్ గా మారిపోయింది. ఉప్పెన ఆమె డెబ్యూ మూవీ కాగా, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు సైతం విజయం సాధించాయి. ఇక రష్మిక స్టార్డం, లక్కీ హీరోయిన్ సెంటిమెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె లేటెస్ట్ మూవీ పుష్ప ఇండియా వైడ్ మోత మోగించింది. అలాగే గత రెండు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ భారీ విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్, శర్వానంద్ కృతి, రష్మిక లనే నమ్ముకున్నారు. వాళ్ళు సెంటిమెంట్ కొనసాగిస్తూ హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు.