దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిమ్మకూరులో మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ వేడుకకు నందమూరి ఫ్యామిలీ నుండి అందరూ రాబోతున్నారని సమాచారం.

కుటుంబ సభ్యులందరికీ ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. మరి ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా..? ఆయనకు ఇన్విటేషన్ అందిందా అనే విషయాన్ని ఆరా తీయగా.. ఎన్టీఆర్ క్యాంప్ నుండి వినిపిస్తోన్న వార్తల ప్రకారం ఇప్పటివరకు తారక్ కి ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఈలోగా బాలయ్య ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్, బాలయ్యలు బాగానే కలిసి ఉంటున్నారు. ఎన్టీఆర్ సినిమా వేడుకకు అతిథిగా బాలయ్య వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సుహాసిని తెలంగాణా ఎలెక్షన్స్ లో కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసింది. కానీ తారక్ మాత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

ఈ విషయంలో అతడిపై విమర్శలు వినిపిస్తోన్న సమయంలో బాలయ్య స్వయంగా తారక్ ని నేనే ప్రచారం చేయొద్దని చెప్పానని, అతడికి ప్రచారం కలిసి రాదని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తారా..? లేదా అనేది చూడాలి. తారక్ గనుక ఈ వేడుకలో పాల్గొంటే ఆ వేడుకకే అందం రావడం ఖాయం!