ఇండియన్ మ్యూజిక్‌ డైరెక్టర్ ఏఆర్ రెహామాన్‌కు ఆస్కార్‌ గౌరవాన్ని అందించిన సినిమా స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌. ముంబై మురికి వాడ ధారవిలోని పిల్లల జీవితం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోవటంతో పాటు కమర్షియల్‌గానూ సూపర్‌ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రకు ముందుగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్‌ ఖాన్‌ చేయాల్సి ఉండగా ఆయన రిజెక్ట్ చేశాడు,

ఈ సినిమాలో ఓ టీవీ కార్యక్రమానికి హోస్ట్ చేసే ప్రేమ్‌ కుమార్‌ పాత్రలో అనిల్‌ కపూర్‌ నటించాడు. అయితే దర్శకుడు డానీ బోయెల్‌ ఈ పాత్రకు ముందుగా షారూఖ్‌ ఖాన్‌ను తీసుకోవాలని భావించాడట. షారూఖ్‌ కూడా ముందుగా ఆ పాత్రలో నటించేందుకు అంగీకరించి కొంత కాలం డానీతో చర్చల్లో పాల్గొన్నాడు. కానీ తన పాత్ర మరీ తక్కువగా ఉందని భావించిన షారూఖ్‌ ఆ పాత్రను రిజెక్ట్ చేశాడు. దీంతో దర్శకుడు ఆ పాత్రకు అనిల్ కపూర్‌ను తీసుకున్నాడు.

2009 సంవత్సరంలో రిలీజ్‌ అయిన ఈ సినిమా ఆస్కార్‌ బరిలో సత్తా చాటింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్‌, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్‌, బెస్ట్ సౌండ్ మిక్సింగ్‌ కేటగిరిలో నామినేట్‌ కాగా ఏఆర్‌ రెహమాన్‌తో పాటు రసూల్‌ పోకుట్టిలు ఆస్కార్‌లు అందుకున్నారు.