టాలీవుడ్ లో స్టార్ హీరోలు సామజిక అంశాలపై స్పందించడం అనేది చాలా కామన్. ఓ విధంగా మంచి విషయాలు కోట్లాది మందికి తెలియాలంటే వారు స్పందించడం కనీసం బాధ్యత అని చెప్పవచ్చు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ప్రస్తుతం తెలంగాణ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున రగడ మొదలవుతున్న సంగతి తెలిసిందే. 

రాష్ట్రానికి ప్రాణవాయువైన నల్లమల్ల అడవులను హరించే ప్రయోగాలు చేయవద్దంటూ సేవ్ నల్లమల్ల యాష్ ట్యాగ్ తో సినీ తారలు కొంతమంది వారి మద్దతును తెలియజేస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో అమెజాన్ అడవులు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు అందరూ మొక్కలు నాటాలని ట్విట్టర్ లో పేర్కొన్న మహేష్ ఇప్పుడు సింగిల్ ట్వీట్ కూడా చేయకపోవడం రూమర్స్ కి తావిస్తోంది. 

స్థానికంగా ఉంటు పక్కనే ఉన్న అడవులు మహేష్ కి కనిపించడం లేదా అని పలు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.  అదే తరహాలో పొలిటీషియన్స్ కి దగ్గరగా ఉన్నా కూడా మొన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ ఆ విషయాన్నీ పట్టించుకోకుండా సేవ్ నల్లమల అంటూ ముందుకొచ్చాడు. మొట్టమొదటగా సినీ ఇండస్ట్రీలో ఈ విషయాన్నీ లేవెనెత్తింది దర్శకుడు శేఖర్ కమ్ముల. అనంతరం పవన్ కళ్యాణ్ సేవ్ నల్లమలకు మరింత బలాన్ని చేకూర్చారు. 

రామ్ - సమంత వంటి వారు కూడా అడవులను కాపాడాలని కనీసం కామన్ మ్యాన్ కి ఉన్న జ్ఞానం కూడా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంకా నల్లమల పై చాలా మంది సినీ తారలు స్పందించవలసి ఉంది, ఎందుకంటె అమెజాన్ అడవుల కోసం పెద్ద ఎత్తున ప్రచారాలు జరిపిన వారు పక్కనే ఉన్న ప్రకృతిపై మౌనం వహించడం ఎంతవరకు కరెక్ట్ అని జనాలు అసంతృప్తి వ్యక్తం చేసున్నారు. అలాగే రాష్ట్ర అధికార పార్టీలు కూడా దీనిని పెద్ద ఎత్తున వ్యతిరేకించకపోవడం మరో షాకింగ్ విషయం.