బాహుబలి సినిమా ప్రచారం పీక్స్ కు వెళ్లింది. సినిమా రిలీజ్ అయింది. అనుకున్న అంచనాలు రీచ్ అయిందా అంటే.. అది వారి వారి ఆలోచనకు సంబంధించింది. అయితే ప్రధానంగా ప్రేక్షకుల మెదళ్లను తొలిచిన ప్రశ్నకు సమాధానం కావాలనుకునే వారు ఆ సమాధానం కోసం గత రెండేళ్లుగా నిరీక్షించి నిరీక్షించి ఏదో అద్భుతం జరిగినందువల్లే కట్టప్ప బాహుబలిని చంపాడనుకుని థియేటర్ కి వెళ్తే మాత్రం సమాధానం రుచించదు. బాహబలి2 సినిమా చూడాలనుకునే వారికి ముందుగా కావాల్సిన సమాధానం అదే కాబట్టి దాన్ని డిజైన్ చేసిన వైనం చూద్దాం.

 

రాజవంశీకులకు కట్టుబానిసగా ఉండే వంశం కట్టప్పది. రాజ వంశీకుల ఆజ్ఞను తప్పొప్పులెన్నకుండా తూచ తప్పకుండా పాటించే పాత్ర అది. పుట్టుకతోనే మహారాజు దంపతులైన తల్లిదండ్రులను కోల్పోయిన అమరేంద్ర బాహుబలిని, ఇచ్చిన మాట ప్రకారం అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది రాజమాత శివగామిదేవి. అమ్మ మాటకు ఎంతో గౌరవం ఇచ్చే పాత్ర అమరేంద్ర బాహుబలి. అయితే తను ప్రేమించిన కుంతల దేశ యువరాణి దేవసేన మూలంగా అమ్మ మాటను ధిక్కరించాల్సిన సంకట స్థితి ఎదురవుతుంది బాహుబలికి. అమ్మ మాట ఒకవైపు, ధర్మం మరోవైపు పరస్పరం ఎటువైపు ఉండాలో అర్థం కాకుండా చేస్తాయి బాహుబలిని. అయితే ధర్మం కోసం దేవున్నైనా ఎదిరించాలన్న అదే అమ్మ మాటను ఆచరించి ధర్మం కోసం దేవసేన వైపు నిలబడతాడు బాహుబలి.

 

ఇదే అదనుగా భల్లాలుడు, బిజ్జల దేవుడు కలిసి శివగామిదేవిని రెచ్చగొట్టటంతో బాహుబలికి రాజ్యం కావాలో, ప్రేమ కావాలో తేల్చుకోవాలని రాజమాత శివగామి ఆదేశిస్తుంది. దాంతో శివగామి ఇచ్చిన అవకాశాల్లో ఒకటైన దేవసేన ప్రేమ కోసం నిలబడి సింహాసనాన్ని వదులుకుంటాడు. అలా శివగామి మహిష్మతి సర్వ సైన్యాధిపతిగా బాహుబలిని నియమిస్తుంది. అయితే మహారాజుగా సింహాసనాన్ని అధిష్టించిన భల్లాలుడు గర్భవతి అయిన దేవసేనకు తోడుగా ఉండి తన ఇష్టాయిష్టాలు... దగ్గరుండి చూసుకోవాలంటూ సైన్యాధిపతిగా విశ్రాంతి తీసుకొమ్మని ఆదేశిస్తాడు.

 

భల్లాలుడి నిర్ణయంపై ఆగ్రహించిన దేవసేన.. తన కోరిక అది కాదని... మాహిష్మతి సామ్రాజ్యాధిపతిగా సింహాసనాన్ని అధిష్టిస్తే చూడాలనుందని అమరేంద్ర బాహుబలిని కోరుతుంది. అక్కడే ఉన్న శివగామి దేవికి అది రుచించక పోవడంతో... అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

 

రాజమాత శివగామి ఆగ్రహాన్ని గ్రహించిన భల్లాలుడు, బిజ్జలదేవుడు కలిసి బాహుబలికి అంతఃపుర బహిష్కరణ శిక్ష విధించేలా ఉసిగొల్పుతారు. మాహిష్మతి సామ్రాజ్య చట్టాల ప్రకారం రాజమాత మాటను జవదాటిన రాజకుటుంబీకులకు అంతఃపుర బహిష్కరణ శిక్ష విధించాలి. ఆ నిబంధనను అనుసరించి అమరేంద్ర బాహుబలికి అంతఃపుర బహిష్కరణ విధిస్తుంది రాజమాత శివగామిదేవి. తక్షణమే.. అఖండ సామ్రాజ్య సేనాధిపతిగా ఉన్న అమరేంద్ర బాహుబలి విధుల నుండి తప్పుకుని... శివగామి పాదాలకు నమస్కరించి అంతఃపురం వీడి రాజ్యంలోని సామాన్య జనజీవన స్రవంతిలో కలుస్తాడు.

 

అయితే.. జనం మధ్య సంతోషంగా బతుకుతున్న బాహుబలిని.. చంపేవరకు రాజుగా తాను మనగలగనని గ్రహించిన భల్లాలుడు ఎలాగైనా బాహుబలిని చంపిందేందుకు శివగామి దేవి ఆదేశించేలా కుట్ర పన్నుతాడు. ఆ కుట్ర ఏంటి.. బాహుబలిని చంపమని కట్టప్పను ఎలా ఆదేశిస్తారు అన్నది ఆ తర్వాతి కథ.

 

అయితే... చిన్నప్పటి నుంచి బాహుబలిని గారంగా లాలించిన కట్టప్ప.. శివగామిదేవి అనుమతితోనే భల్లాలుడు ఆదేశించాడని తెలుసుకుని.. హతాశుడై... నేను ఈ పని చేయలేనని చెప్తాడు. కానీ శివగామిదేవి నువ్వు చంపుతావా.. నన్ను చంపమంటావా అని.. ప్రశ్నించడంతో.. రాజమాత చేతులకు బాహుబలిని చంపిన పాపపు నెత్తురు అంటించడం ఇష్టంలేక.. తానే చంపుతానని అంగీకరిస్తాడు.

 

అదే సమయంలో శత్రువులు కట్టప్పను బంధించి చెట్టుకు వేలాడగట్టి నిప్పంటిస్తారు. ఆ విషయం తెలుసుకున్న అమరేంద్ర బాహుబలి కట్టప్పను కాపాడేందుకు వస్తాడు. శత్రువులను తుదముట్టించి కట్టప్పను కాపాడతాడు. కానీ అదే చోట కట్టప్ప వెన్నుపోటుకు బలవుతాడు.   అయితే.. ఇక్కడే.. బాహుబలిని కత్తితో పొడిచేంత సాహసం, ధైర్యం కట్టప్ప గుండెకు ఎలా సాధ్యమైందనేది ప్రశ్న. ఎందుకంటే... తనను కాపాడేందుకు వచ్చిన బాహుబలిని, నేను చచ్చినా ఫర్వాలేదు వెళ్లిపొమ్మని అంటాడు కట్టప్ప. బతికుంటే బాహుబలిని చంపాల్సి వస్తుంది గనుక. కానీ కట్టప్పను బాహుబలి కాపాడతాడు. అలా ప్రాణ భిక్ష పెట్టిన బాహుబలిని ఒక్క వేటుతో వెనుకనుంచి కట్టప్ప నేరుగా పొడిచి చంపటం రెండేళ్లుగా నిరీక్షించిన ప్రేక్షకులకు అంత కన్విన్సింగ్ గా అనిపించదు.

 

పైగా బాహుబలిని చంపిన తర్వాత నెత్తుటి చేతులతో శివగామి వద్దకు వచ్చిన కట్టప్ప బాహుబలి రక్తం అంటూ శివగామి దేవికి చూపించి... తప్పు చేశావు శివగామి అని ఎదిరిస్తాడు. అలా ఎదిరించేదేదో... చంపకముందే శివగామిని కుట్ర గురించి అలర్ట్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. మొత్తానికి కట్టప్ప బాహుబలిని చంపేందుకు కారణం మహారాజు భల్లాలుడి ఆదేశం, రాజమాత శివగామి అనుమతి, బిజ్జల, భల్లల కుట్ర ఫలితమే అయినా.. కట్టప్ప నేరుగా అంత పని చేయకుండా.. శత్రువును చంపబోతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆ కత్తి బాహుబలి దేహంలో దిగితే.. కన్విన్సింగ్ గా అనిపించేదేమో.. ఎందుకంటే వెన్నుపోటు పొడిచిన కట్టప్ప.. బాహుబలి ఎదురుగా తిరగ్గానే ఖడ్గం ఇచ్చి తప్పు చేశానని తల వంచుతాడు. దానికి బదులు ప్రమాదవశాత్తు పొడిచినట్టు చూపించి., ఆ తర్వాత శివగామికి మాత్రం.. బాహుబలి తన చేతిలోనే చనిపోయాడని చెప్తే బాగుండేది.

 

ఏదేమైనా.. చిత్రం తెరకెక్కించిన విధానం మాత్రం అద్భుతం. ఇంకా ఎన్నో మలుపులు థియేటర్ కి వెళ్లి చూస్తేనే రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి సంతృప్తినిచ్చేది. సాహో బాహుబలి.