‘నాంది’తో మంచి హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్. నూతన దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ చిత్రం మొదట్లో పెద్దగా టాక్ లేకపోయినా ఆ తర్వాత మెల్లిగా పుంజుకుని ఇప్పుడు ప్రేక్షకాదరణతో సక్సెస్ ఫుల్ గా  రన్ అవుతోంది. ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు చూసి టీమ్ అంద‌రినీ అభినందించ‌డానికి హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ‘నాంది అప్రిసియేష‌న్ మీట్’‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సతీష్ వేగేశ్న, అల్లరి నరేష్, విజయ్ కనకమేడల, వరలక్ష్మీ శరత్‌కుమార్ పాల్గొన్నారు. వాస్తవానికి ఈ సినిమాకు దిల్ రాజుకు ఏ సంభందం లేదు. ఈ నేపధ్యంలో దిల్ రాజు ఈ అప్రిషియోషన్ మీట్ ఏర్పాటు చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందుకు కారణమేమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు... ఈ సినిమాకు సంభందించిన అన్ని భాషల రీమేక్ రైట్స్ ఫ్యాన్సీ రేటు ఇచ్చి మరీ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు అప్రిషియోషన్ మీట్ ఎరేంజ్ చేసి ప్రమోట్ చేసారంటున్నారు. అది నిజమే అయితే ఈ సినిమా టీమ్ కు ఇంతకు మించి ఆనందం ఏముంటుంది.

దిల్ రాజు మాట్లాడుతూ...‘సాధ్యమైనంత వరకు ప్రెస్ మీట్‌లకు దూరంగా ఉండాలి.. ఏ సినిమా బడితే ఆ సినిమాకు వెళ్లకూడదు.. ఎందుకంటే, ఈ ఏడాది మావే ఏడెనిమి సినిమాలు ఉన్నాయి.. ఎక్కువ కనిపిస్తాను అని అనుకున్నాను. అందుకే, నన్నెవరూ పిలవకండి అని చెప్పాను. కానీ, ఈ సినిమానే నన్ను పిలుచుకు వచ్చింది’’ అన్నారు.

అలాగే ఒక మంచి సినిమా చేసినప్పుడు అది అవార్డులను, డబ్బులను, గౌరవాన్ని తీసుకొస్తుందని.. ‘నాంది’ కూడా ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ లాభాలు తెచ్చిపెట్టిందని దిల్ రాజు అన్నారు. అయితే, వీటన్నింటికన్నా ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు విజయ్ తన వద్ద మూడు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడని.. కానీ ఈ సినిమా కథ తనకు చెప్పలేదని, సినిమా పూర్తయ్యాక తనకు చూపించలేదని దిల్ రాజు సరదాగా అన్నారు. విజయ్ కాన్ఫిడెన్స్‌తో అనుకున్నది సాధించాడని కొనియాడారు.