'ఘాజీ' .. 'అంతరిక్షం' సినిమాలతో విభిన్న చిత్రాల  దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి మన ముందు నిలబడతారు. 'ఘాజీ' ఘన విజయం సాధిస్తే  .. 'అంతరిక్షం' ఆయన్ను వెనక్కి లాగేసింది. అయినప్పటికీ మొట్టమొదటి తెలుగు స్పేస్ థ్రిల్లర్ మూవీ అని మంచి పేరు వచ్చింది.ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చేయబోయే చిత్రం ఏ కాన్సెప్టు తీసుకుంటారనే టాక్ ఇండస్ట్రీలో మొదలైంది.
 
అందుతున్న సమాచారం మేరకు సంకల్ప్ రెడ్డి మరో టెక్నికల్ అంశాలతో కూడిన చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన మూడవ సినిమాని అంటార్కిటికాలో జరిగే పరిశోధనల నేపథ్యంలో తీయాలని సంకల్ప్ రెడ్డి నిర్ణయించుకున్నారని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

మరి ఈ సినిమాలో హీరోగా ఎవరు చేస్తున్నారు... ఎప్పుడు మొదలవుతుందో, ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారో అనే విషయాలు ఇంకా బయిటకు రాలేదు.  ఈ చిత్రం సైతం భారీ బడ్జెట్ తోనే రూపొందుతోందని సమాచారం.  ఇక ఆయన అంతరిక్షం ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనలేదనే టాక్ ఉంది. దాన్ని ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో ఖండిచారు. 

సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ.."మొదటి నుంచి కూడా నేను గుర్తింపు కోసం పాకులాడలేదు.  గుర్తింపు గురించి పెద్దగా ఆలోచించను .. అందువల్లనే ఎక్కడా పెద్దగా కనిపించను. సినిమా ప్రమోషన్స్ కి కూడా నేను వెళ్లను. నేను ఎలాగో పెద్దగా మాట్లాడను గనుక, ఆర్టిస్టులతోనే ప్రమోషన్స్ చేయించమని చెబుతుంటాను. దర్శకులను చూసి సినిమాకి వచ్చేవాళ్లు చాలా తక్కువ గనుక, ఆర్టిస్టులతోనే ప్రమోషన్స్ చేయించడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం" అని అన్నాడు.