తెలంగాణ జనజీవితంతో పెనవేసుకుపోయిన చేనేతకారుల బ్రతుకు చిత్రానికి అద్దం పడుతూ, ఆసు యంత్ర రూపకర్త చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం చిత్రాన్ని రూపొందించారు. చేనేత వస్త్రాల తయారీలో ఆసు పోయడం తీవ్రమైన శారీరక శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఒక్క చీరను నేయడానికి దాదాపు 9000వేల సార్లు ఆసు యంత్రంపై చేతిని తిప్పాల్సి ఉంటుంది. దీంతో ఆసుపోసే ఎందరో మహిళలు ఎముకలు అరిగిపోయి అనారోగ్యానికి గురయ్యేవారు. 

ఆసు పోస్తూ తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన చింతకింది మల్లేశం ఆసు యంత్ర తయారీకి పూనుకుంటాడు.ఆయన జీవిత చరిత్రను ఆధారం చేసుకుని రూపొందించిన చిత్రం మల్లేశం. ఈ చిత్రాన్ని చూసి రాఘవేంద్రరావు చలించిపోయారు.  దాంతో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంకు ‘దర్శకేంద్రుడు’ రాఘవేంద్రరావు ఆర్థిక సాయం చేశారు. మల్లేశం జీవితాధారంగా వచ్చిన ‘మల్లేశం’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పాత్రలో ప్రముఖ నటుడు ప్రియదర్శి నటించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు చిత్ర యూనిట్ ని  కలిసి అభినందించారు.