ప్రపంచమంతా కొరియన్ చిత్రాల వెనుక ఉంటే, కొరియన్లు 'ఆర్ఆర్ఆర్' వెనుక ఉన్నారు. రీమేక్ రైట్స్ కోసం కొరియన్ మేకర్స్ నుండి భారీ ఆఫర్ వచ్చింది.
హిట్టైన సినిమాలను వేరే భాషల్లోకి రీమేక్ చేస్తూండటం సహజం. అయితే అన్ని భాషల్లో రిలీజైన భారీ సినిమాలను రీమేక్ చేయాలని ఏ నిర్మాతా అనుకోడు. అలాంటిదే ఆర్.ఆర్.ఆర్ చిత్రం. ఈ చిత్రం ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవ్వటంతో రీమేక్ చేయటానికి ఎవరూ ఉత్సాహం చూపలేదు. కానీ ఆమధ్యన ఈ చిత్రాన్ని కొరియా భాషలో రీమేక్ చేయాలని ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో సారి ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
గత కొద్ది రోజులుగా `నాటు నాటు` తో ఆస్కార్ బరిలో నిలిచిన `ఆర్ ఆర్ ఆర్` టైటిల్ వరల్డ్ వైడ్ మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ ముందు వచ్చే ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంటూ ఆస్కార్ పై ఎక్సపెక్టేషన్స్ అంతకంతకు పెంచేస్తున్నారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో `నాటు నాటు` పోటీ పడటంతో భారతీయులంతా ఎంతో గర్విస్తున్నారు. భారత్ తరుపున నామినేట్ కాకపోయినా వ్యక్తిగతంగా రాజమౌళి ఎంతో శ్రమించి ఆ స్థాయికి తీసుకెళ్లారని మెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మరో నాలుగైదు రోజుల్లో జరగబోయే ఆస్కార్ పండుగ కోసం ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులతో పాటు భారతీయులు ..అందులోనూ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తు న్నారు.
ఇక ఇది ప్రక్కన పెడితే.. కొన్ని నెలల క్రితం ఆర్. ఆర్ ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత సునీత తాటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ మధ్యనే చేరిన సునీత తాటి నిర్మించిన "శాకిని డాకిని" అనే సినిమాని రిలీజ్ చేసారు. నివేతా థామస్ మరియు రెజినా కసాండ్రా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన మిడ్ నైట్ రన్నర్స్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. అప్పుడామె మాట్లాడుతూ, "ప్రపంచమంతా కొరియన్ చిత్రాల వెనుక ఉంటే, కొరియన్లు 'ఆర్ఆర్ఆర్' వెనుక ఉన్నారు. రీమేక్ రైట్స్ కోసం కొరియన్ మేకర్స్ నుండి భారీ ఆఫర్ వచ్చింది.
రాజమౌళికి ఇదే విషయం చెప్పినప్పుడు ఆయన ఆసక్తికర రియాక్షన్ ఇచ్చారు. నేను ప్రస్తుతానికి సస్పెన్స్ లోనే ఉన్నాను," అని అన్నారు సునీత. అయితే అప్పుడు జనం పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. కానీ తాజాగా సునీత తాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అప్పటి కొరియా రీమేక్ సంగతి ఏమైంది. ప్రపంచం అంతా ఈ సినిమా గురించి మాట్లాడుతున్న వేళ ఖచ్చితంగా ఇతర దేశ భాషల్లోకి ఈ సినిమా రీమేక్ అవుతుందంటున్నారు. అదే జరిగితే కనుక మన తెలుగు వాళ్లంతా గర్వించదగ్గ విశయం ఇది.
ఎస్ ఎస్ రాజమౌళి.. "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మొట్టమొదటిసారిగా కలిసి నటించిన ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం పిరియాడిక్ డ్రామాగా విడుదలై కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ప్రేక్షకులను అలరించారు. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా జోరు చాలా కాలం కొనసాగింది.
