సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి స్వరం పెంచారు. సుశాంత్‌ కేసులో ఆయన కుటుంబం ప్రధానంగా రియానే నింధితురాలిగా భావిస్తున్నారు. పోలీసులు, ఈడీ సైతం అదే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇటీవల మనీ లాండరింగ్‌ కేసు విషయంలోనూ కూడా సుశాంత్‌ తండ్రి రియాపైనే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. 

తాజాగా రియా చక్రవర్తి సుశాంత్‌ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అసలు వాళ్ళతో తనకు సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు ఆమె లాయర్లు ఓ ప్రకటన విడుదల చేశారు. రియా కోణంలో లాయర్లు చెబుతూ, రియా భారత సైన్యంలో పనిచేసే సర్జన్‌, మహారాష్ట్ర గృహిణి కుమార్తె అని.. సుశాంత్‌, రియా సినిమాల్లో నటిస్తుండటంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని, గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఓ పార్టీలో పాల్గొన్న తర్వాత ఇద్దరు డేటింగ్‌ చేయడం ప్రారంభించారని, గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ 8 వరకు కలిసి ఉన్నారని, ముంబయిలోని బాంద్రాలోని సుశాంత్‌ ఫ్లాట్‌లో కలిసి నివసించినట్టు తెలిపారు. 

జూన్‌8నే ఆమె సుశాంత్‌ ఫ్లాట్‌ నుంచి రియా వెళ్లిపోయిందని, రియాపై సుశాంత్‌ కుటుంబం చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, అర్థరహితమైనవని వెల్లడించారు. ముంబయి పోలీసులు, ఈడీ అధికారులు సుశాంత్‌ బ్యాంక్‌ఖాతాలు పరిశీలించారు. ఎలాంటి లావాదేవీలు జరిగినట్టు నిర్థారణ కాలేదని చట్ట ప్రకారం తేలిందన్నారు.

సుశాంత్‌కి రియా పరిచయమైన కొత్తలో ఆయన ఇంటికి రియా వెళ్ళిందని, ఆ సమయంలో సుశాంత్‌..తన సోదరి ప్రియాంక, ఆమె భర్త సిద్ధార్థ్లతో కలిసి ఉండేవారని, ఓ రోజు జరిగిన పార్టీలో ప్రియాంక అతిగా మద్యం సేవించిందని, రియా.. సుశాంత్‌ గదికి వెళ్ళి నిద్రపోగా, లేచేసరికి ప్రియాంక రియావద్ద ఉందని, ఆమె అసభ్యంగా రియాని తాకిందని తెలిపారు. 

`రియా ఆ సమయంలో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారని, అనంతరం సుశాంత్‌ సోదరిని గది నుంచి వెళ్ళిపోవాలని వాదించినట్టు, ఆమె వెళ్ళకపోగా, అదే విషయాన్ని సుశాంత్‌కి చెప్పగా, ఇద్దరికి గొడవ అయ్యిందని, ఆ వెంటనే సుశాంత్‌  ఇంటి నుంచి రియా వచ్చేసినట్టు తెలిపారు. అప్పట్నుంచే సుశాంత్‌ ఫ్యామిలీతో రియాకి సంబంధాలు తెగిపోయాయని లాయర్లు వెల్లడించారు. 

అంతేకాదు ఇంకా చెబుతూ, ఈ ఏడాది జూన్‌లో సుశాంత్‌ తనకుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ముంబయి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని, ఎవరినైనా వచ్చి కలవమని చెప్పాడు. దీంతో ఆయన సోదరి మీతూ వస్తానని చెప్పడంతో తన ఫ్లాట్‌ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా రియాను సుశాంత్‌ కోరాడు. తనకు ఇష్టం లేకపోయినా..సుశాంత్‌ సోదరి వస్తోందన్న కారణంగా రియా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు రియా డాక్టర్‌ సుశాన్‌ వాకర్‌ వద్ద థెరపీ చేయించుకుందన్నారు. రియా ఎప్పుడూ ఆదిత్య ఠాక్రేను కలవలేదని, కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదని, శివసేన నాయకుడిగా మాత్రమే ఆదిత్య ఆమెకు తెలుసు` అని చెప్పారు. 

ఇలా రోజుకో కొత్త విషయం బయటపడుతూ, సుశాంత్‌ ఆత్మహత్య కేసుని అనేక మలుపులు తిప్పిస్తున్నాయి. మరి ఈ కేసులో ఇంకెన్ని కొత్త విషయాలు బయపడతాయో చూడాలి.