మలయాళంలో సూపర్‌ హిట్‌ సాధించిన `లూసిఫర్‌` రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి `సాహో` ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వం వహిస్తారనే వార్తలు వినిపించాయి. ఇంతలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

`లూసిఫర్‌` రీమేక్‌కి సుజిత్‌ దర్శకత్వం వహించడం లేదట. తన హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ చేయాలని మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి, వినాయక్‌ కాంబినేషన్‌లో `ఠాగూర్‌`, `ఖైదీ నెం.150` చిత్రాలు వచ్చాయి. రెండూ బ్లాక్‌ బస్టర్స్ గా, చిరంజీవి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. 

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి, హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారట. `లూసిఫర్‌` రీమేక్‌ వినాయక్‌ డైరెక్షన్‌ నటించాలని చిరు నిర్ణయించినట్టు సమాచారం. ఓ రకంగా సుజిత్‌కి హ్యాండిచ్చారనే చెప్పాలి.  ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా వినాయక్‌ రూపొందించిన రెండు సినిమాలు రీమేక్‌. `ఠాగూర్‌` తమిళంలో వచ్చిన `రమణ`కి రీమేక్‌. `ఖైదీ నెం.150` తమిళంలో సూపర్‌ హిట్‌ `కత్తి`కి రీమేక్‌. ఇప్పుడు ఈ సినిమా కూడా రీమేక్‌ కావడం విశేషం. బహుశా రీమేక్‌ సినిమాలను వినాయక్‌ బాగా తెరకెక్కిస్తాడనే నమ్మకంతో చిరు ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. 

చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో తమిళ హిట్‌ చిత్రం `వేదాలం` రీమేక్‌లో నటించబోతున్నారు. ఆ తర్వాత `లూసిఫర్‌` ఉండనుంది. అయితే ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేశారట. వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర స్క్రిప్ట్ ని రైటర్‌ ఆకుల శివ రెడీ చేస్తున్నారట. దీన్ని రామ్‌చరణ్‌, ఎన్‌వీ ప్రసాద్‌ నిర్మించనున్నారు.