Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: విశ్వరూపం-2

లోకనాయకుడు కమల్ హాసన్ రూపొందించిన 'విశ్వరూపం' సినిమాకు సీక్వెల్ గా 'విశ్వరూపం-2' సినిమాను రూపొందించారు. విశ్వరూపం సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తుందన్నా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. దానికి కారణం విశ్వరూపం సినిమా అంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపింది

vishwaroopam-2 movie telugu review
Author
Hyderabad, First Published Aug 10, 2018, 12:36 PM IST

నటీనటులు: కమల్ హాసన్, పూజా కుమార్, రాహుల్ బోస్, ఆండ్రియా తదితరులు 
సంగీతం: జిబ్రాన్ 
సినిమాటోగ్రఫీ: షాను వర్గీస్ 
ఎడిటింగ్: మహేష్ నారాయణ్, విజయ్ శంకర్ 
నిర్మాత: కమల్ హాసన్ 
దర్శకత్వం: కమల్ హాసన్ 

లోకనాయకుడు కమల్ హాసన్ రూపొందించిన 'విశ్వరూపం' సినిమాకు సీక్వెల్ గా 'విశ్వరూపం-2' సినిమాను రూపొందించారు. విశ్వరూపం సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తుందన్నా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. దానికి కారణం విశ్వరూపం సినిమా అంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. మరి ఈ సీక్వెల్ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
విసామ్‌ అహ్మద్(కమల్ హాసన్) రా ఏజెంట్. అల్ ఖైదా టెర్రరిజంను అంతం చేయాలనే మిషన్ మీద అతడు వర్క్ చేస్తుంటాడు. ఈ మిషన్ లో అతడికి తోడుగా అతడి సీనియర్ ఆఫీసర్ అలానే అస్మిత(ఆండ్రియా) అనే మరో ఆఫీసర్ ఉంటారు. టెర్రరిస్ట్ లు లండన్ ని టార్గెట్ చేశారని తెలుసుకున్న విజామ్ అక్కడి ప్రభుత్వానికి సహాయం చేయాలనుకుంటాడు. తన టీమ్ అలానే భార్య నిరుపమ(పూజాకుమార్) తో కలిసి లండన్ కు వెళ్తారు. లండన్ లో దిగిన వెంటనే వారిపై ఎటాక్ జరుగుతుంది. ఓ పక్క ఈ స్టోరీ నడుస్తూనే మరోపక్క విసామ్‌ తన గత జ్ఞాపకాలు, అసలు ఈ మిషన్ లోకి ఎలా వచ్చాడనే సంఘటనలు గుర్తు చేసుకుంటాడు. రా ఏజెంట్ అయిన విసామ్‌ ఉగ్రవాదుల్లో కలిసి భారత్ కు గూఢచారిగా పని చేస్తుంటారు. ఈ క్రమంలో అతడు ఒమర్(రాహుల్ బోస్) అనే టెర్రరిస్ట్ గ్రూప్ నాయకుడికి దగ్గరవుతాడు. విసామ్‌ టెర్రరిస్ట్ కాదని ఓ రా ఏజెంట్ అని తెలుసుకున్న ఒమర్ అతడిని చంపాలనుకుంటాడు కానీ కుదరదు. ఎప్పటికైనా అతడిని చంపాలని నిర్ణయించుకుంటాడు. మరి ఒమర్ అనుకున్నట్లుగా విసామ్‌ ను అంతం చేయగలిగాడా..? లేక విసామ్‌ చేతుల్లో ఒమర్ చనిపోతాడా..? టెర్రరిస్ట్ లు లండన్ ను అంతం చేయాలనుకున్న మిషన్ ను విసామ్‌ ఆపగలిగాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

vishwaroopam-2 movie telugu review

విశ్లేషణ: 
అల్ ఖైదా నాయకుడిని అంతం చేసి టెర్రరిజంను రూపుమాపాలని ఆలోచించే ఓ రా ఏజెంట్ కథే ఈ సినిమా. 'విశ్వరూపం' సినిమాలో రా ఏజెంట్ అయిన హీరో టెర్రరిస్ట్ లలో ఒకడిగా కలిసిపోయి వారిని నమ్మించి వారి నాయకుడిని చంపాలని ప్లాన్ చేస్తాడు. ఆ సన్నివేశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా నడుస్తాయి. అసలు హీరో నిజంగానే ఉగ్రవాదేనా.. అనే సందేహాలు కలుగుతూ సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కానీ ఆ ఆసక్తికర కథనం 'విశ్వరూపం-2'లో కనిపించదు. సినిమా లండన్, ఇండియా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంటుంది. సినిమా సగం పూర్తయిన తరువాత కూడా కథ, కథనాలపై క్లారిటీ రాదు. పైగా విశ్వరూపం సినిమా వచ్చి ఐదేళ్లు కావడం సీక్వెల్ కథ కన్ఫ్యూజింగ్ గా సాగడంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇలాంటి రా ఏజెంట్ కథల్లో ఆడియన్స్ ఆశించి ఏ అంశాలు కూడా ఈ కథలో లేవు. ఇన్వెస్టిగేషన్, యాక్షన్ సీన్స్ ఇలా ప్రతీ అంశం ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. కానీ ఈ సినిమా చూసే ఆడియన్స్ లో సగం మంది కథ అర్ధంకాక దిక్కులు చూడడం ఖాయం.

ఇక ఫస్ట్ పార్ట్ చూడకుండా సీక్వెల్ చూడాలనుకుంటే అంతకుమించిన పొరపాటు ఉండదు. మొత్తానికి అటు ఇటు చేసి సెకండ్ హాఫ్ లో మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అయ్యారు. ఉగ్రవాద గ్రూప్ కి నాయకత్వం వహించే ఒమర్ క్యారెక్టర్ కథలోకి ఎంటర్ అయిన తరువాత అతడితో హీరో పోరాడే సన్నివేశాలు పరమ రొటీన్ గా ఉంటాయి. ద్వితీయార్ధంలో మదర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. పతాక సన్నివేశాలు ఊహాజనితంగా ఉన్నాయి. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా కమల్ హాసన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పటికే పాత్రల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేసిన కమల్ హాసన్ గొప్పనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో కూడా కమల్ హాసన్ తాను పోషించిన పాత్ర అద్బుతంగా చేయడంతో పాటు, వైవిద్యతను చాటాడు. టెర్రరిస్టు పాత్రలో టెర్రిఫిక్ లుక్ తో, రా ఏజెంట్ గా సూట్ బూటులో మెప్పించాడు. సీనియర్ హీరో అయినప్పటికీ ఏదొక పాత్రలో నటించాలని అనుకోకుండా నటించడానికి, ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి వయసుతో పనిలేదని నిరూపిస్తున్నాడు. తనకోసం ప్రత్యేకంగా పాత్రలు రాసుకొని మరీ డైరెక్ట్ చేసుకోవడం గొప్ప విషయం. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ కు మిస్ కాకుండా తన ముఖంలో హావభావాలు ప్రదర్శించిన తీరు అద్భుతం.

vishwaroopam-2 movie telugu review

నటుడిగా పూర్తి న్యాయం చేసినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. ఆసక్తికరంగా సాగాల్సిన ఇలాంటి కథ ప్లాట్ నేరేషన్ తో సాగడం ఆడియన్స్ కు రుచించదు. ఒమర్ అనే విలన్ క్యారెక్టర్ ను మరింత బలంగా రాసుకొని ఉండాల్సింది. ఆ పాత్రను మరీ సింపుల్ గా ఎండ్ చేసేశారనిపిస్తుంది. టెర్రరిస్ట్ పాత్రకు సెంటిమెంట్ జోడించడం, తన వల్ల కుటుంబం ఇబ్బంది పడుతుందని హీరో వారికి సహాయం చేయడం కొత్తగా, ఆలోచింపదగిన విధంగా ఉంది. టెర్రరిస్ట్ లకు కుటుంబాలు ఉంటాయని వారు కూడా సాధారణ జీవితాన్నే కోరుకుంటారని దర్శకుడిగా కమల్ చెప్పిన పాయింట్ ప్రశంసనీయం. ఇక ముస్లిం అయిన తనకి కులం, మతంతో సంబంధం లేదని దేశం కోసం పని చేస్తానని హీరో పాత్ర చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి. పూజాకుమార్ ద్వారా కథకు గ్లామర్ ని యాడ్ చేశారు. కానీ కమల్-పూజాల రొమాన్స్ మాత్రం స్క్రీన్ మీద చూడడం కాస్త కష్టమే. ఈ వయసులో కూడా కమల్ హాసన్ లిప్ లాక్ సీన్స్ లో నటించడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఆండ్రియా పాత్రకు మొదటి పార్ట్ తో పోలిస్తే ఇందులో మంచి ప్రాముఖ్యత దక్కింది. సినిమాలో మెప్పించే క్యారెక్టర్లలో ఆమె రోల్ ఒకటి. యాక్షన్ సీన్స్ లో బాగా నటించింది. విలన్ క్యారెక్టర్ లో రాహుల్ బోస్ ఇమిడిపోయారు. టెక్నికల్ గా గ్రాఫిక్స్ వర్క్ చాలా పూర్ అని చెప్పాలి. అనవసరమైన చోట కూడా గ్రాఫిక్స్ ఎందుకు చేశారో అర్ధం కాదు. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది.  టెర్రరిస్టుల స్థావరాలని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సముద్రంలో ఫైట్ సీక్వెన్స్ బాగా పిక్చరైజ్ చేశారు. సినిమాలో కృష్ణ అనే పాట మిస్ ప్లేస్మెంట్ అనిపిస్తుంది. కానీ పాటలు, నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని అందరికీ అర్ధమయ్యే విధంగా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. పాస్ట్, ప్రెజంట్ అంటూ కథనం సాగుతుంది. ఈ స్క్రీన్ ప్లే గేమ్ సాధారణ ఆడియన్స్ కు పెద్దగా నచ్చకపోవచ్చు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఎంతమాత్రం మెప్పించదు. కమల్ హాసన్ కోసం ఒకసారి ఈ సినిమా చూసే ప్రయత్నం మాత్రం చేయొచ్చు. అది కూడా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చుతుంది. కమల్ హాసన్ నటన, అండర్ వాటర్ ఎపిసోడ్ తప్ప సినిమాలో మెప్పించే అంశాలు పెద్దగా లేవనే చెప్పాలి. 

రేటింగ్: 2/5 

                       

 

Follow Us:
Download App:
  • android
  • ios