Asianet News TeluguAsianet News Telugu

అర్జున్ తో వివాదం...కారణమేంటో,ఏం జరిగిందో కుండబద్దలు కొట్టిన విశ్వక్‌

 ‘రాజయోగం’ సినిమా టీజర్‌ విడుదలకు అతిథిగా హాజరైన విశ్వక్‌ ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడా కామెంట్స్ పై ఇండస్ట్రీలో,సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. విశ్వక్ సేన్ వాదన లో న్యాయం ఉందా లేదా అనే ముందు ఆయన ఏమన్నారో చూడండి..

Vishwak Sen says  I leave films even if a spot boy denigrates me
Author
First Published Nov 7, 2022, 7:38 AM IST


 యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌పై సీనియర్‌ స్టార్ హీరో అర్జున్‌ సర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఓ చిత్రం విషయంలో దర్శక, నటుడు అర్జున్‌ (Arjun), విశ్వక్‌కు మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అందుకు కారణం హీరో విశ్వక్ సేన్ అని, అతను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ రావడం వల్లనే సినిమా డిలే అవుతుందని ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు అర్జున్. అంతేకాదు విశ్వక్ సేన్ డెడికేషన్ లేని హీరో అని.. అతనికి ప్రొఫెషనలిజం అంటూ లేదని అర్జున్ మండిపడ్డాడు. దానిపై విశ్వక్‌ స్పందించారు. తనంతటి ప్రొఫెషనల్‌ నటుడు లేరని, అలాంటి తనకు కమిట్‌మెంట్‌ లేదని ఒక్క లైట్‌బాయ్‌ చెప్పినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) అన్నారు. ‘రాజయోగం’ సినిమా టీజర్‌ విడుదలకు అతిథిగా హాజరైన విశ్వక్‌ ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడా కామెంట్స్ పై ఇండస్ట్రీలో,సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. విశ్వక్ సేన్ వాదన లో న్యాయం ఉందా లేదా అనే ముందు ఆయన ఏమన్నారో చూడండి..

‘‘నటుణ్ని అయ్యేందుకు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. అవమానాలు ఎదుర్కొన్నా. ‘ఇప్పుడు వీడు బాగానే ఉన్నాడు కదా’ అనుకుంటూ వాటి గురించి ఎవరూ మాట్లాడరు. కానీ, నటులుగా మేం మాత్రం వాటినే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని. ఏదో అవకాశం వచ్చేసింది కదా అని నేను సినిమాలు చేయను. ప్రేమతో చేస్తుంటా. సినిమాకు సంబంధించిన అన్ని పనులను చూసుకుంటా. అది పూర్తయిన తర్వాత ప్రచారాన్ని భుజాలపై వేసుకుని రోడ్లపై తిరుగుతుంటా. నా అంత కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ నటుడు ఉండడు. 

ఈ ఏడాది నేను మూడు చిత్రాలు పూర్తి చేశా. వాటిల్లోని ఒకదానికి నేనే దర్శకుడు, నిర్మాత, హీరో. నా వల్ల ఇప్పటివరకూ ఏ నిర్మాతా బాధపడలేదు, ఒక్క రూపాయి నష్టపోలేదు. భయపడే చిన్న ప్రొడ్యూసర్స్‌తో నేను పనిచేయలేదు. నేను చేసినవి చిన్న చిత్రాలే అయిండొచ్చు కానీ వాటిని పెద్ద నిర్మాతలు నిర్మించారు. నా సినిమాల సెట్‌లోని ఒక్క లైట్‌బాయ్‌ అయినా.. నన్ను కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ యాక్టర్‌ కాదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. కొత్త దర్శకుడు అయినా, అనుభవం ఉన్న దర్శకుడితో అయినా ‘గివ్‌ అండ్‌ టేక్‌’ పద్ధతిలో పనిచేశా. అన్ని సినిమాల్లానే అర్జున్‌గారి చిత్రానికీ అదే అనుకుని ప్రారంభించా’’

‘‘చిత్రీకరణ మొదలయ్యే వారం ముందు నాకు ఈ సినిమా స్క్రిప్టు అందింది. ‘నేను ఆఫీస్‌ బాయ్‌ ఇన్‌పుట్‌ కూడా వింటా’ అని అర్జున్‌ సర్‌ అన్నారు. ‘నేను ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సర్‌’ అని చెబితే నువ్వు వదిలేయ్‌, నన్ను నమ్ము అంటూ ఏం చెప్పనిచ్చేవారు కాదు. పది విషయాల్లో..  రెండు నా ఇష్టానికి వదిలేసినా ప్రయాణం అలా సాగిపోయేది. కానీ, నన్ను కట్టిపడేశారు. కళ్లుమూసుకుని కాపురం చేసేయ్‌ అన్నట్టుంది వ్యవహారం. అయినా ఏదో విధంగా ముందుకెళ్లానుకొని, లుక్‌ టెస్ట్‌లో పాల్గొని ఆయనకు పంపించా.

 మరుసటి రోజు లేచి, షూట్‌కు బయలుదేరేముందు ఎందుకో భయమేసింది. నాకు ఏ సినిమాకీ ఇలా అనిపించలేదు. అందుకే ‘సర్‌.. ఈ ఒక్కరోజు షూటింగ్‌ రద్దు చేస్తే.. కొన్ని విషయాలు చర్చించుకుందాం’ అని మేసేజ్‌ పెట్టా. నేనూ మా మేనేజరు ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి సమాధానం లేదు. అదేరోజు మధ్యాహ్నం వాళ్ల మేనేజరు నుంచి.. ‘ఇంకేంటి మాట్లాడేది’ అంటూ అకౌంట్‌ వివరాలు పంపించారు. చిత్రం నుంచి వైదొలుగుతానని నేను చెప్పలేదు, సినిమాని నేను ఆపలేదు’’

‘‘షూటింగ్ ప్రారంభానికి ముందు నేను క్యాన్సిల్‌ చేయటం తప్పే. కానీ, నాలుగు రోజులు అయిష్టంగా పనిచేసి తర్వాత కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోవాలనుకోవటం ఇంకా పెద్ద తప్పు. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్యే మాట్లాడా. అంత గౌరవం ఇచ్చా. ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టడం వల్ల ఇప్పుడు నా ఫ్యామిలీ, స్నేహితులు బాధపడుతున్నారు. నేనేం చేయాలి? నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. అలాంటప్పుడు ఆయన చిత్రం గురించి నేనెందుకు మాట్లాడాలి? అనుకున్నా కాబట్టే నిన్న స్పందించలేదు. సినిమాల విషయంలో తప్పు చేశానంటే చెప్పండి.. ఇప్పుడే పరిశ్రమ నుంచి వెళ్లిపోతా. నా వల్ల మీకు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి సర్‌’’ అని విశ్వక్‌ సేన్‌ అర్జున్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios