కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్. సినిమా ప్రమోషన్ కోసం తాను చాలా ప్లాన్ చేసినట్టు చెప్పారు. ప్రాంక్ వీడియోతోపాటు ముందుగానే ఇంకా చాలా ప్రిపేర్ అయ్యామని చెప్పారు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం విశ్వక్ సేన్(Vishwak sen) పేరు బాగా వినిపిస్తుంది. తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన ప్లే చేసే గేమే ఇప్పుడు ఆయన్ని వివాదంలో ఇరుక్కునేలా చేసింది. టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు కేసులు, మరోవైపు టీవీ9 యాంకర్‌తో వివాదం వెరసి విశ్వక్ సేన్ నేమ్ ఇప్పుడు ఫిల్మ్ నగర్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ వివాదంపై విశ్వక్ సేన్ స్పందించారు. తన అసలు ప్లాన్ వేరే ఉందంటూ షాకిచ్చాడు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ `అశోక వనంలో అర్జున కళ్యాణం`(Ashoka Vanamalo Arjuna Kalyanam) చిత్రంలో నటించారు. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ కోసం ఓ ప్రాంక్ వీడియో చేశాడు విశ్వక్ సేన్. ఇది వివాదంగా మారి హెచ్ఆర్సీ వరకు వెళ్లింది. మరోవైపు దీనిపై టీవీ9 న్యూస్ ఛానెల్ డిబేట్ పెట్టగా, అక్కడికి వెళ్లిన విశ్వక్‌సేన్‌పై యాంకర్ దేవినాగవళ్లి చేసిన వ్యాఖ్యలు, దానికి విశ్వక్ సేన్ వాడిన బూతు పదం దుమారం రేపాయి. Vishwak Sen Controversy.
తాజాగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ, దీనిపై క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్. సినిమా ప్రమోషన్ కోసం తాను చాలా ప్లాన్ చేసినట్టు చెప్పారు. తన ప్రాంక్ వీడియోని చిన్నగా ఫన్ కోసం చేశామని, దీంతోపాటు ముందుగానే ఇంకా చాలా ప్రిపేర్ అయ్యామని, మైండ్‌లో చాలా ప్లాన్స్ ఉండేనని తెలిపారు. కానీ ఈ ఒక్క ప్రాంక్ వీడియో మొత్తం తలక్రిందులు చేసిందని, అనుకున్నది ఒక్కటి, అయ్యిందొక్కటి అని వాపోయారు. సినిమా ప్రమోషన్ కోసమే ఇలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశానని, అది పక్కకు వెళ్లి వేరేది హైలైట్ అయ్యిందని చెప్పారు.
నా సినిమా గురించి జనం మాట్లాడుకుంటే బాగుండేదని, కానీ ఇప్పుడు అసలు విషయం పక్కకెళ్లి, వివాదం చర్చనీయాంశంగా మారిందన్నారు. ఇలాంటివి మళ్లీ చేయనని తెలిపారు. తాను ఒక్కసారి చేసిన దాన్ని మళ్లీ రిపీట్ చేయనని తెలిపారు. ఇది వివాదం కాకపోయినా ఇంకెప్పుడూ చేసేవాడిని కాదన్నారు. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో తప్పేముందని ఆయన తెలిపారు.
ఇక `అశోకవనంలో అర్జున కళ్యాణం` సినిమాపై స్పందిస్తూ, 34ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి కాని అబ్బాయిగా కనిపిస్తానని, ప్రతి సాధారణ అబ్బాయి జీవితంలో జరిగే అంశాలే ఇందులో ఉంటాయని, అందుకే యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందన్నారు. నెక్ట్స్ ప్రతి ఏడాది రెండు సినిమాలతో వస్తానని తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న వాటిలో `ధమ్కీ`తోపాటు మరో రెండు చిత్రాలున్నాయని చెప్పాడు. అయితే `ధమ్కీ` చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నాడట. కథలో చాలా మార్పులు చేయాల్సి ఉంది, ఆ కథ తనకు బాగా కనెక్ట్ అయ్యిందని, ప్రతిసారి నేను డైరెక్టర్‌కి ఇలా చేయి అని చెబితే వేలు పెట్టినట్టు ఉంటుందని, అందుకే దర్శకుడిని తొలగించినట్టు చెప్పారు విశ్వక్ సేన్.
దీంతోపాటు తాను హీరోగా నటిస్తూ రూపొందించిన `ఫలక్‌నూమా దాస్` చిత్రానికి సీక్వెల్‌ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది తన పుట్టిన రోజున దాన్నిప్రకటిస్తామని, ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. సినిమాకి `మాస్ కా దాస్` అనే టైటిల్‌ని కూడా వెల్లడించారు విశ్వక్ సేన్.
