అతి తక్కువ కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నహీరో విశ్వక్‌సేన్‌. రీసెంట్ గా నానితో కలిసి ‘హిట్‌’ సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు ‘పాగల్‌’గా మారి మరోసారి అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నరేశ్‌ కొప్పిలి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కాగా.. చిత్రటీమ్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పింది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో విశ్వక్ సేన్‌ను ఎంతో రొమాంటిక్‌గా చూపించారు. ‘రేయ్.. ఎవర్రా.. నా లవర్‌ని ఏడిపించింది’ అనే డైలాగ్‌తో విశ్వక్ ఎంట్రీ ఇచ్చారు. ఈ టీజర్‌ రొమాంటిక్ మ్యూజిక్‌తో మొదలవుతోంది. ఇందులో విశ్వక్‌ను పక్కా లవర్ బాయ్‌గా చూపించారు.  టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. 

‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు విశ్వక్‌సేన్‌. ఇటీవల ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా వచ్చిన థ్రిల్లర్‌ ‘హిట్‌’ ప్రేక్షకులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. దాని తర్వాత విశ్వక్‌సేన్‌ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో గత సినిమాలకంటే భిన్నంగా లవర్‌బాయ్‌లా విశ్వక్‌ కనిపించనున్నట్లు ఫస్ట్‌లుక్‌ను బట్టి అర్థమవుతోంది. ‘అందాలరాక్షసి’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలకు సంగీతం అందించిన రాధన్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.