బయోపిక్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారు నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి. ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలని ఆయన నిర్మించారు. ప్రస్తుతం విష్ణు వర్ధన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్రపై 83అనే చిత్రాన్ని, జయలలిత బయోపిక్ చిత్రాన్ని కంగనా రనౌత్ తో తెరకెక్కిస్తున్నారు. 

తాజాగా మీడియా సమావేశంలో విష్ణు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత, కపిల్ దేవ్ బయోపిక్ చిత్రాలు నిర్మించాలనే ఆలోచన తనదే అని విష్ణు అన్నారు. ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ అంచనాలు అందుకోలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాల్లో తీయడం తప్పు అని నా ఫీలింగ్. 

ప్రేక్షకులు కోరుకున్న ఏదో అంశాన్ని ఈ చిత్రంలో చూపించలేకపోయాం అని విష్ణు అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నాకొక ఖరీదైన గుణపాఠం అని విష్ణు అభివర్ణించారు. గాంధీ జీవిత చరిత్ర, మహాభారతం లాంటి పెద్ద కథలని కూడా ఒకే ఒకే చిత్రంలో చూపించగలిగారు. ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఒక సినిమాగానే తెరకెక్కించి ఉంటే బావుండేది అని విష్ణు అభిప్రాయ పడ్డారు.