తమిళ టాప్ హీరో విశాల్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో అతడు కొన్ని సార్లు హిట్ కూడా అందుకున్నాడు. అయితే ఇప్పుడు తెలుగు నుండి రీమేక్ చేసిన సినిమాను మళ్లీ తెలుగులో డబ్ చేయాలనుకుంటున్నాడు ఈ హీరో.

వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. దీంతో ఆ సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేశారు. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ నటించగా... తమిళంలో విశాల్ నటించాడు. 'అయోగ్య' అనే పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల తమిళంలో విడుదలై సక్సెస్ అందుకుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాను తిరిగి తెలుగు డబ్ చేయాలని భావిస్తున్నారట. దానికి కారణం తమిళ టెంపర్ చిత్రంలో చివరి అరగంటలో కొన్ని మార్పులు చేశారు. డ్రామా తగ్గించి ఫైట్ లేకుండా హీరో పాత్రకు ఊహించని క్లైమాక్స్ సెట్ చేశారు. ఇది తమిళంలో బాగా వర్కవుట్ అయింది.

అందుకే ఇప్పుడు తెలుగుకి తీసుకురావాలని చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కొత్త క్లైమాక్స్ ని ఎంజాయ్ చేస్తారని నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ డబ్బింగ్ హక్కులను కొన్నారట. చివరి అరగంట తీసేస్తే మిగిలిన రెండు గంటలు 'టెంపర్' సినిమాకు మక్కికి మక్కి ఉంటుంది. అలాంటప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్ చేయడం ఎంత వరకు వర్కవుట్ అవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిగురించి విశాల్ ఇంకా స్పందించలేదు.