కరోనా మహమ్మారి మరలా పంజా విసురుతుంది. బాలీవుడ్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఇటీవలే స్టార్ రైటర్, రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ కి కరోనా సోకింది. తాజాగా దర్శకుడు వేణు ఉడుగుల కరోనా బారినపడినట్లు సమాచారం అందుతుంది. రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వం చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.  దాదాపు షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ చిత్రం. 


దర్శకుడు వేణుకు కరోనా నేపథ్యంలో మూవీ విడుదలపై ప్రభావం చూపనుంది. వారం రోజుల క్రితమే వేణుకు కరోనా నిర్ధారణ అయ్యిందట. కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే, ఆయన క్వారంటైన్ కావడంతో పాటు, ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారట. ఏప్రిల్ 30న విరాటపర్వం విడుదల కావాల్సి ఉండగా, దాదాపు వాయిదా పడినట్లు సమాచారం అందుతుంది. 


కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు 50శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ నడిపే విధంగా ఆదేశాలు జారీ చేసే యోచనలో ఉన్నాయి. విరాట పర్వం విడుదల వాయిదాకు ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. మరో వైపు యాంటీ టెర్రిరిజం ఫోర్స్(ఏటీఎఫ్) ఆచార్య, విరాటపర్వం చిత్రాల విడుదల ఆపేయాలంటూ లేఖ విడుదల చేశారు. టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్న ఇలాంటి చిత్రాల విడుదల నిలిపివేయాలని వారు కోరుతున్నారు.