నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా తెలుగులో హీరోగా మరో చిత్రంలో నటించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రలో నటించాడు. ఎట్టకేలకు రానా హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఎప్పటినుంచో వినిపిస్తున్న విరాటపర్వం 1992 చిత్రం శనివారం రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. 

నాదీ నీది ఒకే కథ చిత్రంతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. క్రేజీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. 1990 నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రానా తండ్రి సురేష్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 

ఇదిలా ఉండగా ఫస్ట్ షెడ్యూల్ మొత్తం రానా లేకుండా సాయి పల్లవితోనే పూర్తి చేయనున్నారు. ఈ చిత్రం కోసం తన లుక్ మార్చుకుని సెకండ్ షెడ్యూల్ నుంచి రానా జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.