ఇండియాలో అత్యంత శక్తివంతమైన సెలబ్రిటీ బ్రాండ్‌గా వరుసగా మూడోసారి ఎవరు  నిలిచారు. ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ , రష్మిక మందన్న ఏ స్థానంలో ఉందో తెలుసా? 

ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్, భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాను ప్రకటించింది. ఇందులో క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 231.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,920 కోట్లు) బ్రాండ్ విలువతో, విరాట్ కోహ్లీ వరుసగా మూడోసారి భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సెలబ్రిటీ బ్రాండ్‌గా నిలిచారు. ఈ క్రమంలో బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, అలియా భట్‌లను అధిగమించారు.

అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ స్టార్ విరాట్ కోహ్లీ, క్రీడా మైదానంలోనే కాకుండా, వాణిజ్య ప్రకటనల ప్రపంచంలో కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. సోషల్ మీడియాలో 273 మిలియన్లకు పైగా అభిమానులను కలిగి ఉన్న ఆయన, భారతదేశంలో అత్యధికంగా ఫాలో అవుతున్న వ్యక్తి. ఈ కారణంగానే ఆయన బ్రాండ్ విలువ రోజురోజుకు పెరుగుతోంది. భారీ కంపెనీలు ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.

సెకండ్ ప్లేస్ నుంచి బాలీవుడ్ స్టార్స్ 

కోహ్లీ తర్వాత స్థానాన్ని బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ దక్కించుకున్నారు. ఆయన బ్రాండ్ విలువ 170.7 మిలియన్ డాలర్లు. షారుఖ్ ఖాన్ 145.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో స్థానంలో ఉన్నారు. పఠాన్, జవాన్ లాంటి భారీ విజయాల వల్ల షారుఖ్ విలువ 21% పెరిగింది. నాలుగో స్థానంలో అలియా భట్ ఉండగా, ఆమె విలువ 116.4 మిలియన్ డాలర్లకు పెరిగింది.

టాప్ తారలు ఎవరెవరు

ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ (108 మిలియన్ డాలర్లు) ఉండగా, ఏడో స్థానాన్ని దీపికా పదుకొణె, ఎం.ఎస్. ధోని (102.9 మిలియన్ డాలర్లు) పంచుకున్నారు. హృతిక్ రోషన్ 92.2 మిలియన్ డాలర్ల విలువతో తొమ్మిదో స్థానానికి ఎగబాకారు. పదో స్థానంలో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (83.7 మిలియన్ డాలర్లు) ఉండగా, సల్మాన్ ఖాన్ 57 మిలియన్ డాలర్ల విలువతో 16వ స్థానంలో నిలిచారు.

సౌత్ నుంచి ఎవరున్నారంటే? 

టాప్ 25 జాబితాలో కేవలం బాలీవుడ్ తారలే కాకుండా, దక్షిణాది నటీనటులు కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కన్నడ నటి, పాన్ ఇండియా స్టార్, నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న 15వ స్థానంలో (58.9 మిలియన్ డాలర్లు), అల్లు అర్జున్ 24వ స్థానంలో (35.5 మిలియన్ డాలర్లు) ఉన్నారు.

హీరోయిన్లదే టాప్ ప్లేస్

కరీనా కపూర్ (79.5 మిలియన్ డాలర్లు) 11వ స్థానంలో, కియారా అద్వానీ (68 మిలియన్ డాలర్లు) 13వ స్థానంలో, అనుష్క శర్మ (48.4 మిలియన్ డాలర్లు) 17వ స్థానంలో ఉన్నారు. కృతి సనన్, తమన్నా భాటియా లాంటి మరికొందరు టాప్ 25లో చోటు దక్కించుకున్నారు.ఈ జాబితా భారతదేశంలో క్రీడలతో పాటు సినిమా రంగం బలమైన ప్రభావాన్ని చూపించింది. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువ స్థానాలు సాధించారు. విరాట్ కోహ్లీ వరుసగా టాప్ ప్లేస్ లో కొనసాగుతుండటంతో, ఆయన ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడుతున్నారు.