Asianet News TeluguAsianet News Telugu

'వినయ విధేయ రామ' రివ్యూ..

'యాక్షన్ సినిమాలే...కమర్షియల్ సినిమాలు' అన్న  సిద్దాంతాన్ని నమ్మి, ఆచిరిస్తున్నాడు బోయపాటి శ్రీను. తనతో చేద్దామనుకునే  హీరోలు తన రూట్ లోకి రావాల్సిందే కానీ తను వాళ్లు చేసే కథల తరహా సినిమాలు చేయాలనుకోడు. 

vinaya vidheya rama movie review
Author
Hyderabad, First Published Jan 11, 2019, 9:17 AM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

'యాక్షన్ సినిమాలే...కమర్షియల్ సినిమాలు' అన్న  సిద్దాంతాన్ని నమ్మి, ఆచిరిస్తున్నాడు బోయపాటి శ్రీను. తనతో చేద్దామనుకునే  హీరోలు తన రూట్ లోకి రావాల్సిందే కానీ తను వాళ్లు చేసే కథల తరహా సినిమాలు చేయాలనుకోడు. అందుకోసం ఆయన తన హీరోకు కండలు పెంచటం దగ్గర నుంచి, పట్టుకునే ఆయుధాలు దాకా ప్రత్యేక శ్రద్ద వహిస్తూంటారు. కథ,కథనం  కన్నా యాక్షన్  సీన్స్ మీద ఎక్కువ కసరత్తు  చేసి అందులోనే డిఫరెన్స్  ట్రై చేస్తూంటాడు. 

పరమ హంసలా ఉండే హీరో... ఒకానొక మూమెంట్ లో  హింసతో చెలరేగిపోవటానికి సరిపడా మలుపు,మసాలా  ఉండే స్టోరీలైన్స్ ని ఎంచుకునే ఆయన ఈ సారి రామ్ చరణ్ తో  ‘వినయ విధేయ రామ’ అంటూ వినసొంపైన టైటిల్ పెట్టారు. అయితే ఇంత కూల్ టైటిల్ కు వేసిన రామ్ చరణ్ ని  రాంబో గా మార్చిన స్టిల్స్ కు సింక్ చేసే విధంగా సినిమా ఉందా... ఈ సారైనా బోయపాటి కొత్త కథని చెప్పే ప్రయత్నం చేసారా..లేక కొత్త ఫైట్ సీక్వెన్స్ తోనే సరిపెట్టేసారా... గ్యాంగ్ లీడర్ కథ అంటూ ఈ సినిమా మొదలెట్టిన నాటి నుంచీ ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంత ఉంది, రంగస్దలం వంటి విభిన్నమైన కమర్షియల్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేయదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 

కథేంటి..

ఓ నలుగురు అనాధలు. వాళ్లకు ఓ రోజు పొత్తిళ్లలో ఉన్న పసి బిడ్డ రామ్ కొణెదల (రామ్ చరణ్) దొరుకుతాడు. దాంతో వాళ్లంతా రామ్ ని అల్లారు ముద్దుగా చూసుకుంటూంటారు.  ఓ కుటుంబంలా , సొంత అన్నదమ్ముల్లా పెరిగి పెద్దవుతారు. రామ్ కూడా తన అన్నలపై ఈగ వాలితే రాక్షసబల్లి మీద పడినట్లుగా ఫీలై విధ్వంసం సృష్టిస్తూంటాడు. ఈ క్రమంలో  పెద్దన్న  భువన్ కుమార్(ప్రశాంత్) ఐఎఎస్ అయ్యి... ఎలక్షన్ కమిషనర్ గా జాబ్ చేస్తూంటాడు. ఎలాంటి క్లిష్టమైన పరిస్దితుల్లో అయినా  అవినీతి జరగకుండా ఎలక్షన్స్ జరిపించటంలో అతనికి మంచి పేరు ఉంటుంది.  ఈ క్రమంలో అతనికి వైజాగ్ నుంచి బీహార్ దాకా శత్రువులు ఏర్పడతారు. అయితే వాళ్ళ నుంచి తనని, కుటుంబాన్ని రక్షిస్తూ రామ్ ఓ వలయంలా ఉంటాడు కాబట్టి బెంగ ఉండదు. 

మరో ప్రక్క వైజాగ్ లోని పందెం పరుశురామ్ (మఖేష్ రుషి) కూడా భువన్ కుమార్ వల్ల, రామ్ వల్ల చావు దెబ్బ తిని ఉంటాడు. దాంతో వాళ్ళు భువన్ కుమార్ ని,అతని ఫ్యామిలీని, ముఖ్యంగా రామ్ ని చంపేసేందుకు స్కెచ్ వేసి రౌండ్ చేస్తారు. ఇంకాసేపట్లో మొత్తం ఫ్యామిలీని వాళ్ళు లేపేస్తారనగా... ఊహించని విదంగా బీహార్ సీఎం వచ్చి.. వాళ్ల నుంచి రామ్ ని, ఫ్యామిలీని సేవ్ చేసి... నువ్వు బీహార్ కు వచ్చిన మరో బుద్దుడువి అని రామ్ చరణ్ ని  పొగుడుతాడు. 

అంతేకాకుండా ఇందంతా.. ఆశ్చర్యంగా చూస్తున్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ప్లాష్ బ్యాక్ లో  బీహార్ లో మృగంలాంటి  గ్యాంగస్టర్ రాజూ భాయ్ (వివేక్ ఒబరాయ్) ఒకడుంటాడు. వాడు నరరూప రాక్షసుడు. అక్కడ  ఎలక్షన్స్ జరగనివ్వడు. సీఎం ని కూడా లెక్క చెయ్యడు. సైన్యంతో వచ్చిన ఎలక్షన్ కమిషనర్ భువన్ కుమార్ మీదా ఎటాక్ చేస్తాడు. అప్పుడు భువన్ కుమార్ కోరికపై రామ్ రంగంలోకి దిగుతాడు.. చచ్చేటట్లు కొట్టి..ఆ గ్యాంగ్ లో చాలా భాగం అంతం చేస్తాడు...ఇదంతా చెప్పిన సీఎం ఆ కుటుంబం షాక్ అయ్యే ఓ నిజం చెప్తాడు.  

ఇంతకీ ఆ సీఎం రివీల్ చేసిన షాకయ్యే నిజం ఏమిటి... అసలు రాజూ భాయ్ చనిపోయాడా..బ్రతికున్నాడా, చిరవకు భువన్ కుమార్ అక్కడ ఎలక్షన్స్ జరిపించాడా , ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వాని పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. 

vinaya vidheya rama movie review

కథా విధ్వంసమే..

మొదటే చెప్పుకున్నట్లు బోయపాటి సినిమా అనేది ఓ బ్రాండ్. దాన్ని ఆయన తన సినిమాలతో ఆ  బ్రాండ్ ని  ప్రమోట్ చేస్తూనే ఉంటారు. అయితే ఆ బ్రాండ్ అప్పుడప్పుడూ అదుపుతప్పుతుంది. దాన్ని కంట్రోలులో పెట్టడం ఆయన వ్లలకాదు..అలాంటప్పుడే దమ్ము, జయ జయ జానికి రామ లాంటి సినిమాలు వస్తూంటాయి. ఇదిగో ఇప్పుడు  ‘వినయ విధేయ రామ’ దిగింది. ఈ సినిమాలో కథ,కథనాలపై కొచెం కూడా శ్రద్ద పెట్టలేదని, కేవలం యాక్షన్ సీన్స్ పైనే దృష్టి పెట్టారని అర్దమవుతుంది. తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకునే కార్యక్రమమే హీరో ఇందులో చేస్తాడు. హీరోయిన్ కేవలం నామ మాత్రమే. 

అయితే ఆ యాక్షన్ ఎపిసోడ్స్  తీసినంత బాగా పండలేదు. అందుకు కారణం.యాక్షన్ సినిమాలకు కూడా ఓ డిజైన్ ఉంటుందని మర్చిపోవటం. దాంతో ..హీరో పూర్తిగా  ప్యాసివ్ గా మారిపోతున్నా గమనించుకోలేదు.  కథలో హీరో...మొదటిసారి విలన్ ని కలిసినప్పుడు కొట్టి కోమాలోకి పంపుతాడు. మళ్లీ రెండో సారి  క్లైమాక్స్ లో ఎదుర్కొని చంపేస్తాడు. ఈ రెండు సార్లు తప్ప విలన్,హీరోకు మధ్య వేరేదేమీ జరగదు. హీరో కొడితే కోమాలోకి వెళ్లిన విలన్ ... హీరోని ఏమైనా చెయ్యాలని ప్రయత్నం చేసి, అందులోంచి హీరో రక్షించటమో , ఓడటమో జరుగుతూ, ఎత్తులు, పై ఎత్తులు ఉంటే కధలో ఇంట్రస్ట్ ఉంటుంది. అంతేకానీ వెళ్లాడు చంపేసాడు అంటే ఇంట్రస్ట్ ఏమి ఉంటుంది.  హీరో యాక్షన్ తో విధ్వంసం సృష్టిస్తే చాలు అనుకున్నారు కానీ కథ విధ్వసం జరిగిపోతోందని  చూసుకోలేదు.

 

వదిలేసారు..

ఫస్టాఫ్ లో ముఖేష్ రుషి పాత్ర, సాక్షి రామ్  పాత్రలను వదిలేసారు. వాటికి సరైన ముగింపు ఇవ్వలేదు. ఫస్టాఫ్ మొత్తం ఆ పాత్రలతో నడిపి ..అంత బిల్డప్ ఇచ్చిప్పుడు అవి కేవలం టైమ్ గ్యాప్ పాత్రలుగా పరిగణించి పట్టించుకోక పోతే ఎలా..

 

సెకండాఫే తేడా..

ఫస్టాఫ్ ఆడుతూ, పాడుతూ, ఫైట్స్ చేసుకుంటూ నడిచిపోయినా సెకండాఫ్ మాత్రం అలా ఆగిపోయింది. ప్లాష్ బ్యాక్ ,క్లైమాక్స్ తప్ప వేరేదేమీ లేదు. సెకండాఫ్ లో కాస్త కథ పెట్టుకుని ఉంటే మరోలా ఉండేది. చెప్పుకోదగ్గ హై మూవ్ మెంట్స్ కూడా ఏమీ లేవు. 

vinaya vidheya rama movie review

 

ఫన్ కూడా..

ఇలాంటి సినిమాల్లో కామెడీ కాస్త ఊరగా ఉన్నా నడిచిపోతుంది. అది ఖచ్చితంగా ఉండాల్సిన రిలీఫ్ కూడా. ఫస్టాఫ్ లో హేమ పాత్రతో కాస్త కామెడీ పండించినా,సెకండాఫ్ లో అదీ మిస్సైంది. అయితే కథలో ఆ ప్లేస్ కూడా లేదు. సైడ్ ట్రాక్ అయినా పెట్టాల్సింది. 

 

బాలయ్య సీన్ గుర్తుకు..  

అప్పట్లో ఓ సినిమాలో బాలకృష్ణ ట్రైన్ ని చేత్తో ఆపే సీన్ , కుర్చీని సైగతలో లేపటం వంటివి హాస్యాస్పదంగా మారి విచిత్రంగా చెప్పుకునేవారు. ఈ సినిమాలోనూ అలాంటి ఫీట్ ఒకటి రామ్ చరణ్ చేత చేయించారు బోయపాటి. పైనుంచి వెళ్తున్న వేగంగా  ట్రైన్ పైకి దూకటం ..చూస్తూంటే అవన్నీ గుర్తుకు వస్తాయి.

 

రంగస్దలం తర్వాత 

రామ్ చరణ్ గతంలో రచ్చ వంటి యాక్షన్ సినిమాలు చేసినా ఇలాంటి సినిమా చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే అసలు పూర్తిగా అదే పని మీద ఏదో ఉద్యోగం చేస్తున్నట్లుగా చాలా శ్రద్దగా విలన్స్ తో ఫైట్స్  చేస్తూంటాడు.  ప్రపంచంలో ఈ గొడవ తప్పే వేరేదేమీ లేదన్నట్లు చెలరేగిపోతూంటాడు. అయితే పాత్రకు తగినట్లు చరణ్ ...తన బాడీ ని షేప్ చేసుకోవటం కష్టం కనిపిస్తుంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో, ఎమోషన్స్ పండించటంలో  రామ్ చరణ్ ...తన లోపం  లేకుండా చూసుకున్నాడు. ఎన్ని చెప్పుకున్నా రంగస్దలం తర్వాత చేయాల్సిన సినిమా మాత్రం కాదు

 

టెక్నికల్ గా

ఈ సినిమాలో ఫస్ట్ క్రెడిట్ ఫైట్స్ డిజైన్ చేసిన కొరియాగ్రాఫర్స్ కు ఇవ్వాలి. ఒక దానికి మరొకటి సంభంధం లేకుండా చూసుకున్నారు. బోయపాటి డైరక్షన్ టాలెంట్ కథ మింగేసింది. పాటల్లో తస్సాదియ్యా సాంగ్ ..తెరపై విజువల్ ఫీస్ట్. రామ్ చరణ్ స్టైలింగ్, కొరియోగ్రఫీ అన్ని ఫెరఫెక్ట్ . రామా లవ్స్ సీత ..టిపికల్ డాన్స్ నంబర్..కొత్తగా ఏమీ అనిపించలేదు. ఏదైమైనా దేవిశ్రీప్రసాద్ డిజప్పాయింట్ చేసారు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా చేయటం కలిసొచ్చింది. 

హీరోయిన్ కైరా అద్వాని చేయటానికి ఏమీ లేకపోయినా తన పరిధిలో మెప్పించింది. ముఖేష్ రుషి, వివేక్ ఒబరాయ్ లు ఇధ్దరూ విలనీని తమ దైన శైలిలో పండించారు. 

 

హైలెట్స్..

ఇంటర్వెల్ బ్లాక్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.  అలాగే ముఖేష్ రుషికు అతని అడ్డాకి వెళ్లి  సారీ చెప్పే సీన్ బాగా పండింది. 

 

ఫైనల్ థాట్..

కథలో యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసుకోవాలి కానీ..యాక్షన్ సీక్వెల్స్ లు చుట్టూ కథ అల్ల కూడదు.

రేటింగ్: 2.5/5

 

నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు

నిర్మాత: డీవీవీ దానయ్య

దర్శకత్వం: బోయపాటి శ్రీను

సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌

విడుదల 11-01-2019

Follow Us:
Download App:
  • android
  • ios