నటి విజయశాంతి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల జయంతి నేపథ్యంలో ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

చిత్ర పరిశ్రమపై విజయనిర్మల తనదైన ముద్ర వేశారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆమె కళామతల్లికి సేవలు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. విజయనిర్మల జయంతి నేడు. ఫిబ్రవరి 20, 1946లో ఆమె జన్మించారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి హీరో కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. బ్రతికున్నంత వరకు విజయనిర్మల-కృష్ణ పాలు, నీళ్ల వలె కలిసి ఉన్నారు. 2019 జూన్ 27న విజయనిర్మల గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. 

విజయనిర్మల జయంతి నేపథ్యంలో విజయశాంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన మేలును గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ''నన్ను కళాకారిణిగా విశ్వసించి సూపర్ స్టార్ కృష్ణ గారితో హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమాకు నడిపించి, నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మల గారు... మీపై అభిమానం, ఆ గౌరవం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తించుకునే జ్ఞాపకంతో... జన్మదిన శుభాకాంక్షలతో.... మీ విజయశాంతి... అని రాసుకొచ్చింది. 

సెట్స్ లో విజయనిర్మల, కృష్ణతో దిగిన ఫోటో షేర్ చేశారు. 1979లో కళుక్కుళ్ ఈరమ్ అనే తమిళ చిత్రంతో విజయశాంతి సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. రెండో చిత్రం కిలాడి కృష్ణుడు. ఈ చిత్రానికి విజయనిర్మల దర్శకురాలు కాగా కృష్ణ-విజయశాంతి జంటగా నటించారు. ఈ మూవీ సెట్స్ లో దిగిన ఫోటో విజయశాంతి షేర్ చేసింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విజయశాంతి హీరోలకు సమానమైన ఇమేజ్ అనుభవించింది. సిల్వర్ స్క్రీన్ పై విజయశాంతి చేసిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే... 

Scroll to load tweet…