తెలుగు చలనచిత్ర రంగంలో విజయశాంతి ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ పాత్రలు చేస్తూనే స్టార్ హీరోలకు ధీటుగా కర్తవ్యం లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అదరగొట్టారు. 90 దశకంలోనే విజయశాంతి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును సార్థకం చేసుకుంది. 2006లో నటించిన నాయుడమ్మ చిత్రమే విజయశాంతికి చివరి చిత్రం. ఆ తర్వాత విజయశాంతి రాజకీయంగా బిజీ అయిపోయారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లోని సరిలేరు నీకెవ్వరు చిత్రం శుక్రవారం రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో విజయశాంతి నటించబోతున్నట్లు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు. తాజాగా విజయశాంతి కూడా ట్విట్టర్ వేదికగా తన రీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

'నేను తెలుగులో నటించిన తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు. సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించిన ఆ చిత్రం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. 1980లో కిలాడి కృష్ణుడు విడుదలయింది. తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో 180కి పైగా చిత్రాల్లో నటించా. బాలీవుడ్ లో కూడా నటించా. సినిమాలపై నాకు గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. కళాకారిణి అయినందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా'.

మహేష్ బాబుగారి చిత్రంతో 2020లో మరోసారి నటిగా మీ ముందుకు వస్తున్నా. మరోసారి నేను సినిమాల్లో నటించాలనేది దైవ సంకల్పమో, ప్రజల దీవేనో. ఏది ఏమైనా కర్తవ్యాన్ని బాధ్యతతో నిర్వహించడమే తెలిసిన మీ రాములమ్మగా మీ ముందుకు వస్తున్నా అంటూ విజయశాంతి ప్రకటించారు.