కన్నడ బ్యూటీ రష్మిక, టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండల కాంబినేషన్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది. వెండితెరపై ఈ జంట కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు ఇద్దరూ కలిసి చేయడంతో ఆ మధ్య ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి.

అయితే విజయ్ తనకు స్నేహితుడు మాత్రమేనని రష్మిక కొన్ని సందర్భాల్లో వెల్లడించింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ రష్మికని ఉద్దేశిస్తూ ఓ కామెంట్ పెట్టాడు. విజయ్ దేవరకొండ, రష్మికల జంట చాలా బాగుంటుందని.. మీరిద్దరూ కలిసి డేటింగ్ చేయొచ్చు కదా.. అంటూ నేరుగా రష్మికని అడిగాడు. ఇది చూసిన రష్మిక అతడికి కూల్ గా బదులిచ్చింది.

'సారీ మై లవ్..' అంటూ మొదలుపెట్టిన రష్మిక.. విజయ్ తో తనకున్న రిలేషన్ గురించి వెల్లడించింది. కూర్చొని డేటింగ్ చేసుకునేంత సమయం ప్రస్తుతం ఇద్దరికీ లేదని.. చేసే పనిలోనే ఇద్దరం ఒకరిపై ఒకరం ప్రేమ, గౌరవం పంచుకుంటామని చెప్పింది.

ఇప్పటివరకు విజయ్ ని ఎంతగానో చిరాకుపెట్టానని.. ఆ దెబ్బకి అతడు మరో రెండేళ్ల వరకు తనతో సినిమా సైన్ చేయడానికి కూడా ఆలోచిస్తాడంటూ సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో కార్తితో మరో సినిమా చేస్తోంది.