కోలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ ఏడాది తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు వారిని కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు. అతడు నటించిన 'నవాబ్' సినిమాలో ఎంతమంది హీరోలు ఉన్నా.. విజయ్ సేతుపతి పాత్రకి మాత్రం మంచి గుర్తింపు లభించింది.

ఇక అతడు నటించిన '96' సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని కొనియాడారు. సినిమాలో విజయ్ నటనని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఈ ఏడాదిలో విజయ్ సేతుపతికి బాగానే కలిసొచ్చింది.

అయితే ఈ నటుడు మాత్రం తను ఆర్థికంగా బాగా నష్టపోయానని అన్నాడు. అయితే ఎలా అనే విషయాన్ని చెప్పనప్పటికీ మీడియా వర్గాల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది విజయ్ సేతుపతి నిర్మాతగా 'జుంగా' అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా కోసం దాదాపు పదకొండు కోట్లు రూపాయలు ఇన్వెస్ట్ చేశాడట.

ఈ సినిమా షూటింగ్ దాదాపు విదేశాల్లోనే జరుపుకుంది. కానీ సినిమా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. దీని కారణంగా విజయ్ సేతుపతి భారీగా నష్టపోయాడని తెలుస్తోంది. ఈ సినిమా నష్టాల నుండి బయటపడడానికి తను ఈ ఏడాదిలో నటించిన సినిమాల రెమ్యునరేషన్ ని వదులుకోవాల్సి వచ్చింది.