‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్ తో బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేసారు  విజయ్‌ దేవరకొండ. దాంతో ఆయనతో సినిమా చేయటానికి కరణ్ జోహార్ వంటి ప్రముఖ నిర్మాతలు సైతం ఉత్సాహం చూపించారు. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు దేవరకొండ.. బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారయిందని సమాచారం‌. 

హిందీలో ‘కాయ్‌ పో చే’, ‘కేదార్‌నాథ్‌’ తదితర హిట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో ఓ సినిమాతో విజయ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారట.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీరుడి పాత్ర ఆధారంగా ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ కపూర్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్‌ సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. ఈ వార్తే కనుక నిజమైతే అదొక క్రేజీ ప్రాజెక్టుగా మారుతుందనటంలో సందేహం లేదు. అటు దేశభక్తి, ఇటు పాన్ ఇండియా ప్రాజెక్టు గా ఈ భారీ సినిమా రూపొందుతుంది. 

గత ఏడాది భారత్‌, పాకిస్తాన్‌ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్‌ అభినందన్‌.. పాక్ సైనికుల చేతికి చిక్కి మూడు రోజులు బంధీగా ఉన్నారు. అనంతరం పాక్‌ ప్రభుత్వం అభినందన్‌ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. ఆ కథనం ఆధారంగా అభిషేక్‌ కపూర్‌ ఓ సినిమా రూపొందించనున్నారట. సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. 

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు పూరీ. హిందీలో కరణ్ జోహార్ దీన్ని విడుదల చేస్తున్నాడు. ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు పూరీ. వచ్చే ఏడాది వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.