Family Star Glimpse: విజయ్ దేవరకొండ కొత్త సినిమా `ఫ్యామిలీ స్టార్`.. గ్లింప్స్ అదిరింది..
`గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతుంది. తాజాగా దీనికి `ఫ్యామిలీ స్టార్` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మళ్లీ ఫ్యామిలీ బాట పట్టాడు. ఆయన `గీత గోవిందం`, ఇటీవల వచ్చిన `ఖుషి` చిత్రాలతో లవ్ కమ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలు చేశారు. `ఖుషి`లో పెళ్లి తర్వాత స్ట్రగుల్స్ చూపించారు. ఇప్పుడు కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్నారు. పరశురామ్ చిత్రంలో ఆయన ఫ్యామిలీ స్టార్‌గా కనిపిస్తున్నారు. అవును.. ఈ చిత్రానికి `ఫ్యామిలీ స్టార్`(Family Star)గా టైటిల్‌ని ఖరారు చేశారు.
ఈ మేరకు బుధవారం సాయంత్రం `ఫ్యామిలీ స్టార్`(Family Star Glimpse) చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో టైటిల్‌కి తగ్గట్టుగానే ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. గ్లింప్స్ లో ఫ్యామిలీ టచ్‌తోపాటు యాక్షన్ చూపించారు. క్లాసీగా కొట్టుడు అదిరిపోయింది. ఇక గ్లింప్స్ ప్రారంభంలో.. `లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్ కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించడాలు అనుకున్నావా సెటిల్ మెంట్ అంటే ` అని అజయ్ ఘోస్ గాంభీర్యంగా అనగా, భలే మాట్లాడతారన్నా మీరంతా. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా, ఏ ఐరెన్ వంచాలా ఏంటి అంటూ ఐరన్ వంచుతూ డైలాగ్ చెప్పిన అదిరిపోయింది.
అంతేకాదు విలన్ గ్యాంగ్ లోని ఒకడి తల పగలగొట్టి సారీ బాబాయ్.. కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా, తలకాయ కొట్టేశా` అని విలన్ కి కూల్‌గా వార్నింగ్ ఇచ్చిన తీరు అదిరిపోయింది. ఇక చివరగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న విజయ్ దేవరకొండని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ `ఏమండి` అంటూ పిలవగానే విజయ్ ఫ్రీజ్ అయిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్ మేళవించి ఉన్న కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా దీన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
`గీత గోవిందం` తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం `ఫ్యామిలీ స్టార్`. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మొత్తానికి `గీతగోవిందం`తో వంద కోట్లు వసూలు చేసి స్టార్ అయిపోయాడు విజయ్. ఇప్పుడు మరోసారి బ్లాక్ బస్టర్‌ని కొట్టేందుకు రెడీ అవుతున్నారు. మరి `గీతగోవిందం` మ్యాజిక్ రిపీట్ అవుతుందా ? అనేది చూడాలి. ఈ చిత్రానికి కేయూ మోహనన్ కెమెరామెన్‌గా, గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.