ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ వంటి అగ్ర దర్శకులు సైతం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. అంతగా తన పాపులారిటీతో దూసుకుపోతున్నాడు.

ఓ పక్కన సినిమాలు చేస్తూనే మరోపక్క పలు ప్రకటనల్లో నటిస్తున్నాడు. వివిధ సంస్థలు విజయ్ దేవరకొండని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నాయి. సినిమాల పరంగా తన రేంజ్ ని పక్కన పెట్టి ప్రకటనల కోసం అతి తక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంటుండడంతో అతడి కోసం చాలా కంపనీలు క్యూ కడుతున్నాయి.

టాలీవుడ్ కి సంబంధించి బ్రాండ్స్ విషయంలో మహేష్ బాబుదే అగ్ర స్థానం. మిగతా హీరోలతో పోలిస్తే మహేష్ బాబు ఈ విషయంలో ముందుంటాడు. పలు సంస్థలకు బ్రాండ్  అంబాసిడర్ గా వ్యవహరిస్తూ తనకు ఈ విషయంలో పోటీ ఎవరూ లేరని నిరూపించాడు. కానీ ఇప్పుడు మహేష్ కి పోటీగా బరిలోకి విజయ్ దేవరకొండ దిగాడు.

అయిదారు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విజయ్ తన సొంత బ్రాండ్ 'రౌడీ'ని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. ఇదే రేంజ్ లో విజయ్ దేవరకొండ దూసుకుపోతే మహేష్ బాబుని దాటేయడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో 'డియర్ కామ్రేడ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.