నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు వద్దంటూ సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా యురేనియం తవ్వకాలని వ్యతిరేకిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా ఈ అంశం పెద్ద వివాదం అవుతోంది. 

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై సెటైరికల్ కామెంట్స్ చేశాడు. '20 వేలఎకరాల నల్లమల నాశనం కాబోతోంది. ఇప్పటికే చెరువుల్ని నాశనం చేసుకున్నాం. వరదలకు కారణం అయ్యాం. కరువుకు కూడా మనమే కారణం. చాలా వరకు తాగునీరు కలుషితంగా మారింది. 

గాలి కూడా కలుషితంగా మారింది. అయినా కూడా మనం నాశనం అనే పదానికి న్యాయం చేస్తూనే ఉన్నాం. ఏదైనా మంచిది అని కనిపిస్తే అది నాశనం అవుతోంది. ఇప్పుడు నల్లమల పై కన్ను పడింది. యురేనియం అంతగా అవసరం అయితే కొనుక్కోవచ్చు. కానీ అడవులని కొనగలమా ? యురేనియంకి బదులు సోలార్ ఎనర్జీని ఉపయోగించండి. 

ప్రతి ఒక్కరు ఇళ్లలో సోలార్ ప్యానల్స్ ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయండి. అంతే కానీ.. మనకు అత్యంత అవసరమైన పర్యావరణం, గాలి, నీటిని నాశనం చేసుకుంటూ యురేనియంతో ఏం పీకుతాం' అంటూ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.