సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరస విజయాలతో మంచి జోరు మీద ఉన్నారు.  తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు. స్పోర్ట్స్  నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్‌లో జరిగాయి.

ఈ కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. కొరటాల శివ మొదటి షాట్‌కు క్లాప్ కొట్టారు.  మరోసారి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో బహు భాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఈ మూవీలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో మలయాళ నటి మాళవిక మోహనన్‌ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. విజయ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాతో కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

ఇక ఇప్పటికే ఇప్పటికే విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా కాంత్రికుమార్ దర్శకత్వంలో మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ సెట్స్‌ మీద ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు విజయ్‌.