టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో స్టార్ హీరో క్రేజ్ దక్కించుకున్నాడు. 'పెళ్లిచూపులు' సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో ఆ తరువాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' చిత్రాలతో తన స్థాయిని పెంచుకున్నాడు.

రీసెంట్ గా 'టాక్సీవాలా' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. తన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటుడికి అంతగా ఫాలోయింగ్ రావడానికి కారణం 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలే కీలకంగా చెప్పుకోవచ్చు.

ఈ రెండు సినిమాల్లో తన వైవిధ్యమైన నటనతో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన ఇద్దరు దర్శకులు సందీప్ రెడ్డి వంగ, పరసురాంలు ఒకేరోజు జన్మించారు.

డిసంబర్ 25న క్రిస్మస్ రోజున ఈ ఇద్దరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో తనకు హిట్స్ ఇచ్చిన ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ''మీరిద్దరూ ఒకేరోజు పుట్టారు. నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు'' అంటూ రాసుకొచ్చాడు. వాళ్లతో సరదాగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.