టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రాంతి మాధవ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు విజయ్ దేవరకొండ.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొత్తగూడెంలో జరుగుతోంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దాదాపు 22 ఏళ్ల క్రితం బాలకృష్ణ 'నిప్పురవ్వ' సినిమాలో సింగరేణి కార్మికుడి పాత్ర పోషించాడు. మళ్లీ ఇంతకాలానికి ఓ తెలుగు హీరో ఆ పాత్రలో కనిపించనున్నాడు. అప్పట్లో 'నిప్పురవ్వ' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాను మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చే విధంగా రూపొందిస్తున్నారట.

గతంలోక్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన 'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి హీరోతో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్ వంటి తారలు హీరోయిన్లుగా కనిపించనున్నారు.