విజయ్ ఆంటోని.. బిచ్చగాడు చిత్రంతో సినిమా అభిమానులంతా తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఏమాత్రం క్రేజ్, అంచనాలు లేకుండా నటుడిగా మారిన విజయ్ ఆంటోని గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. చాలా మంది ఒక చిత్రం హిట్ కాగానే కమర్షియల్ సక్సెస్ కోసం ప్రయత్నించి బోల్తాకొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ విజయ్ ఆంటోని అలాంటి పొరపాటు చేయలేదు. నటుడిగాతన బలం ఏంటో తెలుసుకుని అలాంటి సినిమాలే చేస్తున్నాడు. 

బిచ్చగాడు తర్వాత ఆంటోని నటించిన చిత్రాలు నిరాశపరిచాయి. కానీ ఆడియన్స్ లో మాత్రం అతడి గురించి ఆసక్తి తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ ఆంటోని నటించిన కిల్లర్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. జూన్ 7 కిల్లర్ మూవీ తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆంటోని మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

కిల్లర్ మూవీ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఆడియన్స్ సీట్ల అంచున కూర్చుని చూసే విధంగా ఉంటుందని తెలిపాడు. ఈ చిత్రంలో ఆంటోని కిల్లర్ పాత్రలో నటిస్తున్నాడు. తనని వేటాడే పోలీస్ పాత్రలో సీనియర్ నటుడు అర్జున్ నటిస్తున్నాడు. అర్జున్ లాంటి లెజెండ్రీ నటుడితో నటించడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక తన గత చిత్రాలన్నీ ప్రేక్షకులకు నిరాశని కలిగించినట్లు ఆంటోని అంగీకరించాడు. 

నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. నా లిమిట్స్ నాకు తెలుసు. వాటిని సరిచేసుకుంటూ తదుపరి చిత్రాలు చేస్తాను అంటూ పరాజయాన్ని నిజాయతీగా అంగీకరించాడు. ప్రస్తుతం తాను నటించాల్సిన 10 చిత్రాలు క్యూలో ఉన్నట్లు ఆంటోని తెలిపాడు. నాకు కొన్ని ప్లాపులు ఎదురైన తర్వాత వీడి పని అయిపోయింది అని చాలా మంది అన్నారు. వాళ్లే ఇప్పుడు నేను 10 చిత్రాల్లో నటిస్తున్నానని తెలిసి ఆశ్చర్యపోతున్నారని విజయ్ ఆంటోని తెలిపాడు.